Telangana New Cabinet: తెలంగాణలో కొత్త కేబినెట్ కొన్ని గంటల్లో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. మంత్రి వర్గంలో 11 మందికి చోటు కల్పించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్, నల్గొండ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి గెలుపొందిన కొండా సురేఖతోపాటు మరికొందరు సీనియర్లను తన టీంలోకి తీసుకున్నారు. కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న వారి ప్రొఫైల్స్ ఓ సారి చూద్దాం.
మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో నుంచి నాల్గో సారి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామం. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశారు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్‌గా పని చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2014లో మధిర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో మధిర నుంచే మూడోసారి గెలుపొందారు. 2019 నుంచి CLP లీడర్‌గా ఉన్నారు.
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
మంథని నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు, జయమ్మ దంపతులకు 1969 మే 30న జన్మించారు. ఐఏఎస్ అధికారి శైలజ రామయ్యర్‌తో వివాహం జరిగింది. మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో పౌర సరఫరాలు, శాసన వ్యవహారాల మంత్రిగా పని చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కూడా పేరు నమోదు చేసుకున్నారు. తండ్రి శ్రీపాదరావు హత్యతో 1999లో రాజకీయాల్లో వచ్చారు శ్రీధర్‌బాబు. 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి మొదటి సారిగా గెలుపొందారు. 2004, 2009, 2018, 2023 మంథని నుంచి విజయం సాధించారు. 2004-2019 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ కూాడ ఉన్నారు. 2010-2014 వరకు కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రిగా, 2009-10 వరకు ఉన్నత విద్య, ఎన్నారై వ్యవహారాల మంత్రిగా విధులు నిర్వహించారు. 2014లో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పొన్నం ప్రభాకర్ గౌడ్ 1967 మే 8న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సత్తయ్య - మల్లమ్మ. 2000 ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్ఎల్‌బి పూర్తి చేశారు. 2009లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. అత్యంత పిన్న వయస్సులో ఎంపీగా ఎన్నికైన నేతగా పొన్నం పేరు మీద రికార్డు ఉంది. విద్యార్థి ఉద్యమకారుడిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఇప్పుడు మంత్రి అవుతున్నారు.
కొండా సురేఖ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నేత.1965 ఆగస్ట్ 19న జన్మించారు. 1995లో మండల పరిషత్‌కు ఎన్నికల్లో విజయం సాధించి సంచలనంగా మారారు. 1996లో పీసీసీ సభ్యురాలుగా పని చేశారు. 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000లో ఏఐసీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2004లో శాయంపేట నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పరకాల నుంచి అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సురేఖ జగన్ వెంట నడిచారు. 2013లో వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా, కాంగ్రెస్‌లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో కీలకమైన నేతల్లో ఒకరు. 1963 మే 23న జన్మించిన ఈయన ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన తొలి సభ్యుడయ్యారు.
వైఎస్, రోశయ్య మంత్రివర్గాల‌్లో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా కూడా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011 అక్టోబరు 5న మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2022 ఏప్రిల్ 10న శాసనసభ ఎన్నికల స్టార్ క్యాంపెనర్‌గా నియమితులయ్యారు. 2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు.
ధనసరి అనసూయ అంటే తెలియకపోవచ్చేమో కానీ సీతక్క అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేశారు. తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజకీయ జీవితం ప్రారంభించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వస్తున్నారు. నాలుగు సార్లు పోటీ చేస్తే మూడుసార్లు విజయం సాధించారు.
మొదట్లో సీతక్క జననాట్య మండలి ద్వారా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేవాళ్లు. జరుగుతున్న అన్యాయంపై నాటకాల ద్వార ప్రజలకు తెలియ జెప్పేవారు. అప్పటి భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని భావించి నక్సల్స్‌లో చేరారు. సీతక్క 1988లో నక్సల్‌లో చేరినప్పుడు సీతక్కా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుంచి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షపై కోపంతో నక్సల్స్‌లో చేరారు. జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరి పోరాటం చేశారు. చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు.
ఎన్టీఆర్ పిలుపు మేరకు మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివారు. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. స్థానికంగా మంచి పేరు ఉన్నందున చంద్రబాబు ఆమెకు టికెట్ ఇచ్చారు. దీంతో సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి వీరయ్యపై గెలిచారు. 2014లోమూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో నిలిచి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
మంత్రిగా ప్రమాణం చేయబోతున్న తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1953 నవంబరు 15న జన్మించిన ఈయన.. 1982లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1985, 1994,1999లో శాసనసభకు ఎన్నికయ్యారు. సత్తుపల్లి నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995, 1996 లో మరోసారి చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2001లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికై మంత్రిగా పని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2023లో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా తుమ్మల పని చేసిన రికార్డు సొంతే చేసుకున్నారు.
ఎయిర్ ఫోర్స్ టు పాలిటిక్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కేరీర్‌ను ప్రారంభించిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనూీ కెప్టెన్‌గా ఉన్నారు. ఈసారి కూడా హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. బీఎస్సీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 1982 నుంచి 1991 వరకు ఐఏఎఫ్‌లో పని చేశారు. 1999, 2004లో కోదాడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. 2009, 2014, 2018, 2023లో హుజుర్‌నగర్ నుంచి విజయం సాధించారు. 2019లో హుజుర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2019లో నల్గొండ ఎంపీగా గెలిచారు. 2015- 2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. మిగ్ 21, మిగ్ 23ను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ గా ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత , ప్రోటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా కూడా పని చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పొంగులేటి వైవిధ్యమైన రాజకీయం
పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయం చాలా వైవిధ్యమైంది. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా నారాయణపురం. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్ నిర్మాణం చేసి బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయాలు స్టార్ట్ చేశారు. 2014లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేసి విజంయ సాధించారు. కొంతకాలం తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు పొంగులేటి. 2023 జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2023 జులై 14న టీ-పీసీసీ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ గా ఉన్నారు. 2023లో పాలేరు నుంచి పోటీ, ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొంది మంత్రి అవుతున్నారు.
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజయవర్గం నుంచి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కొల్లాపూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో గెలుపుతో హ్యాట్రిక్ కొట్టారు. 2012, 2014లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆరోసారి విజయం సాధించారు. వైఎస్ కేబినెట్‌లో పౌర సరఫరాలు, వినయోగదారుల వ్యవహారాలు మంత్రిగా, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.