తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్నారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు, ఐఎన్‌డీఐఏ కూటమిలోని నేతలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ సీఎంలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలకు ఆహ్వానాలు అందాయి. దీంతోపాటు ప్రజలను కూడా ఆహ్వానిస్తూ ఓ బహిరంగ లేఖను రేవంత్ విడుదల చేశారు.
ఇలా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన వెంటనే వేదికపైనే ఆరు గ్యారంటీలపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. వాటిపై సంతకాలు చేస్తారు. అనంతరం ఆయన నేరుగా సచివాలయానికి చేరుకుంటారు.
సచివాలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. సర్వమత ప్రార్థనలు జరగనున్నాయి. తర్వాత సీఎం శాంతికుమారితోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు తెలంగాణలోని రైతులను నిలువునా ముంచేశాయి. దీనిపై తొలి సమీక్ష ఉండే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే రైతులకు ఎలాంటి సమస్యా రాకుండా చూడాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఇప్పుడు వాటిపైనే సమీక్ష చేసే ఛాన్స్ ఉంది.