తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలను ఇచ్చింది. వాటన్నింటి కంటే ఆరు గ్యారంటీలు చాలా ప్రధాన పాత్ర పోషించాయి. వాటిని జనాల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పట్ల ప్రజలకు సానుకూల దృక్పదాన్ని కలిగించారు నేతలు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలపైనే సంతకాలు పెడతామని ప్రతి మీటింగ్‌లోనూ నేతలంతా చెప్పారు. 


ఏంటా ఆరు గ్యారంటీలు 


మహాలక్ష్మి
18 ఏళ్లు నిండిన ప్రతి  మహిళకు నెలక 2500 రూపాయల డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భారీగా పెరిగిపోయిన గ్యాస్‌ సిలిండర్ ధరలను తగ్గించేందుకు కూడా తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా గ్యాస్‌ సిలిండర్‌ ఐదు వందల రూపాయలకే ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లింది. 


రైతు భరోసా ప్రతి ఏటా 
రైతులకు, కౌలు రైతులకు ఏకరానికి 15000 రూపాయల రైతుల భరోసాను ఇస్తామని కాంగ్రెస్ మ్యానిపెస్టోలో పెట్టింది. దీంతోపాటు వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఇస్తామని పేర్కొంది. వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చింది. 


గృహ జ్యోతి 
గృహజ్యోతి పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చింది. 


ఇందిరమ్మ ఇండ్లు
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొంది. 
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు వారి కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని గ్యారంటీ ఇచ్చింది. 


యువ వికాసం 
విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. 


చేయూత 
చేయూత పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌లను 4000 వేలకు పెంచబోతున్నట్టు తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా ను కూడా 10 లక్షలు చేయబోతున్నట్టు వెల్లడించారు. 


వీటితోపాటు ప్రతి జిల్లాకు ప్రత్యేక డిక్లరేషన్ ఇచ్చారు. ఇలా భారీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు . ప్రతి బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొన్న అన్ని ప్రచార కార్యక్రమాల్లో ఈ ఆరు గ్యారంటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందుకే ఈ ఆరు గ్యారంటీలను మొదటిగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేయనున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత వాటి విధివిధానాలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డి ప్రజల సాక్షిగా కాంగ్రెస్ నేతల ముందు ఈ ఆరు గ్యారంటీలపై సంతకం చేయనున్నారు.