బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశాక, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందనే సంపూర్ణ విశ్వాసం తమలో కలిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు రెండు చోట్ల గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే పరోక్షంగా కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించారని, ఇప్పుడు కేసీఆర్‌ను గజ్వేల్‌లో, కామారెడ్డిలో ఓడిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
చాలా మంచి ముహూర్తం ఉందని.. అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్నామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గర్తు చేశారు. కానీ, అభ్యర్థుల జాబితా విడుదల చేయకుండా ఆ సమయానికి లిక్కర్ షాపుల టెండర్ల ప్రక్రియకు లక్కీ డ్రా చేయడం మొదలుపెట్టారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో మోసపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌పై తిరగబడాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్ లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపాటి హన్మంతరావు లాంటి తిరుగుబాటు నేతలు మరింత మంది బయటకు వస్తారని అన్నారు. గజ్వేల్‌లో గెలుస్తానన్న నమ్మకం లేకపోవడం వల్లే కేసీఆర్ కామారెడ్డికి మారనారని అన్నారు. ఆయనపై ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనుభవం ఉన్న షబ్బీర్ అలీ పోటీ చేసి కచ్చితంగా గెలుస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మీడియాపై వ్యాఖ్యలపైనా రేవంత్ స్పందన
తనకు అనుకూలంగా లేని మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపడం సీఎం కేసీఆర్ దొరతనానికి నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు. 2014లో మీడియా ఛానళ్ల బహిష్కరణను వ్యతిరేకిస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలన్న వాదన దగ్గరి నుంచే కేసీఆర్ తనను శత్రువులా చూస్తున్నారని రేవంత్ గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడే ఛానళ్లను, పత్రికలను వ్యతిరేకించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వే ఫలితాలే చెబుతున్నాయి - భట్టి
గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతున్నారని సర్వే ఫలితాలు తేటతెల్లం చేశారనే సీఎం కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంతోనే బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతుందని అన్నారు. కేసీఆర్‌కే దిక్కులేక కామారెడ్డికి పోతున్నారని.. ఇక అలాంటి కేసీఆర్ బొమ్మతో మిగితావాళ్ళు ఎలా గెలుస్తారని భట్టి ఎద్దేవా చేశారు. ఎవరు ఎక్కడ పోటీచేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారు అందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని అన్నారు.
తాము అభ్యర్థుల విషయంలో పక్కాగా ఉన్నామని, ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టామని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదంటూ కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లబోతున్నామని అన్నారు. కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ముందు నిలబడి సెల్ఫీ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టబోతున్నామని భట్టి విక్రమార్క అన్నారు.