అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తామని చెబుతున్న బీఆర్‌ఎస్‌ కాసేపట్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనుంది. దీంతో అశావాహులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. టికెట్ దొరకదని అసంతృప్తితో ఉన్నవాళ్లు స్వరాలు పెంచుతున్నారు. ప్రధాన నేతల ఇంటికి టికెట్ల కోసం చక్కర్లు కొడుతున్నారు. 


టికెట్లు ఖరారు చేసే కోర్ టీంలో హరీష్ రావు ఒకరు. అలాంటి హరీష్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుంత రావు ఫైర్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన నియోజకవర్గాన్ని వదిలేసి నా నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తున్నరాని ధ్వజమెత్తారు. 


తాను కచ్చితంగా మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తామంటూ స్పష్టం చేశారు. తన కుమారుడు కూడా మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారని అన్నారు. ప్రస్తుతానికి తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అన్న మైనంపల్లి... తనకు ఎప్పుడో టికెట్ కన్ఫామ్ చేశారని చెప్పుకొచ్చారు. 


మధ్యలో హరీష్‌ కలుగుజేసుకొని పెత్తనం చెలాయించడం ఏంటని ఫైర్ అయ్యారు మైనంపల్లి. అవసరమైతే తన సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. హరీష్‌ను కూడా ఆయన నియోజకవర్గంలో ఓడించేందుకు కూడా వెనకాడబోనని అన్నారు. హరీష్ గతాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయన అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు.