Mahila Sadassu 2024 at Parade Grounds: మహిళా సంఘాల్లో సభ్యులను కోటీశ్వరులను చేసే బాధ్యత తమదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో స్వశక్తి మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. సదస్సు ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు అమ్ముకునేలా స్టాళ్లు ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్‌ ధర పెంచి కేసీఆర్‌, మోదీ ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నారని అన్నారు. కేసీఆర్‌ ఏడు లక్షల కోట్ల అప్పు తన నెత్తిన పెట్టి పోయిండని రేవంత్ ఆరోపించారు. తానిప్పుడు సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకెళ్తున్నానని అన్నారు.


తెలంగాన సీఎంగా మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ అయితే కొంత మందికి కడుపు మండుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వాన్ని మహిళలే గెలిపించారని.. అలా గెలిపించిన తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కేసీఆర్‌, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనని మోదీకి మనం ఎందుకు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును ఆయన ఎన్నోసార్లు అవమానించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియాగాంధీ పార్లమెంట్‌ తలుపులు మూసివేసి తెలంగాణ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరాలని తలుపులు మూసి బిల్లు పాస్‌ చేయించారని అన్నారు.




గ‌తేడాది సెప్టెంబ‌రు 17న సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమ‌ల్లో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేశామ‌ని, ఇప్ప‌టికే 23 కోట్ల మంది మహిళ‌లు ఉచిత బస్సు ప్ర‌యాణం చేశార‌ని ఆయ‌న తెలిపారు. మ‌హిళ‌లను క‌ట్టెల పొయ్యి క‌ష్టాల‌ను గ‌ట్టెక్కించేందుకు గ‌తంలో దీపం ప‌థ‌కం ద్వారా సోనియా గాంధీ రూ.400కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లిసి దానిని రూ.1200కు పెంచి మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యికి మళ్లే ప‌రిస్థితి క‌ల్పించార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేర‌కు రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తున్నామ‌ని, కేసీఆర్ రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌ని గాలికి వ‌దిలిస్తే తాము అధికారంలోకి రాగానే దానిని పున‌రుద్ధ‌రించి దాని ప‌రిమితిని రూ.ప‌ది ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప‌దేళ్లు ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, తాము రాష్ట్రంలో పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో రూ.22,500 కోట్ల‌తో నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. ఇందిర‌మ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. 




రూ.ల‌క్ష కోట్ల రుణాల అనుసంధానం...
మ‌హిళా శ‌క్తి మ‌హిళా ఉన్న‌తి-తెలంగాణ ప్ర‌గ‌తి విజ‌న్ డాక్యుమెంట్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివ‌ర్గ స‌హ‌చరుల‌తో క‌లిసి ఆవిష్క‌రించారు. వ‌చ్చే అయిదేళ్ల‌లో మ‌హిళ‌ల‌కు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా ఎస్‌హెచ్‌జీల‌కు రూ.ల‌క్ష కోట్ల రుణాలను అనుసంధానించ‌డం, సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు పున‌రుద్ధ‌రించ‌డం, సంఘాల ఉత్ప‌త్తుల‌కు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, సంఘాల‌కు శిక్ష‌ణ, సంఘాల స‌భ్యుల‌కు రుణ బీమా, సంఘాల్లోని మ‌హిళ‌ల‌కు రూ.ప‌ది లక్ష‌ల జీవిత బీమా, పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం సంఘాల‌తో నిర్వ‌హ‌ణ వంటి అంశాలు విజ‌న్ డాక్యుమెంట్‌లో ఉన్నాయి.