Amit Shah at Bhagyalakshmi Temple: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్ర నేత అమిత్ షా హైదరాబాద్ లోని చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం తొలుత సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో నిర్వహించిన సోషల్ మీడియా వాలంటీర్ల సబలో పాల్గొన్న అమిత్ షా.. తర్వాత ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వెళ్లారు. అమ్మవారి ఆలయంలో అమిత్ షా వచ్చినందున పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


ఈ పూజలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత తదితరులు ఉన్నారు. అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శన సమయంలో మాధవి లత ప్రత్యేకంగా నిలిచారు. స్వచ్ఛమైన హిందూ సాంప్రదాయ దుస్తుల్లో ఆమె కనిపించారు. అమిత్ షా పర్యటన కోసం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక స్వాగతం లభించింది.


మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం - అమిత్ షా


అంతకుముందు అమిత్ షా ఎల్బీ స్టేడియంలోని సభలో మాట్లాడుతూ.. ‘‘వినాశకర విధానాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఏకమయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని కుటుంబ వారసత్వ రాజకీయ పార్టీలు అడ్డుకోలేవు. దేశమంతా మోదీ సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయం’’ అని అమిత్ షా మాట్లాడారు.