Modi South Tour :  లోక్ సభ ఎన్నికల్లో 410కి పైగా సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజీపీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీయే కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవంతో పాటు వాళ్ల సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. ఇక దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం.. విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగగానే ప్రధాని మోదీ ఈనెల 15 నుంచి 19 వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు శుడిగాలి పర్యటించి ప్రజలకు చేరువకానున్నారు. 


తెలంగాణలో మూడు రోజుల పాటు                                                                        


ఈ నెల 16, 18, 19 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  ఈ నెల 15 నుంచి 19 దాకా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మోదీ సమయం కేటాయించారు. ఇందులో భాగంగా ఈ మూడు తేదీల్లో మూడుచోట్ల పార్టీ పరంగా ఏర్పాటు చేయనున్న బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు.  పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికే సమయం కేటాయిస్తున్నారు. 


మూడు చోట్ల బహిరంగసభలు                       


మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరిలలో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.  . ఒక్కో చోట నిర్వహించే బహిరంగసభలో రెండు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, నాగర్‌కర్నూల్‌ బహిరంగసభలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి సభలో భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు కవరయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.  


17న చిలుకలూరిపేట సభకు మోదీ                     
  
 చిలకలూరిపేట (Chilakaluripet)లో ఈ నెల 17న జరగనున్న టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) మూడు పార్టీల ఉమ్మడి సభ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) హాజరుకానున్నారు. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది. ఈ సభ నిర్వహణ, కమిటీలతో సమన్వయము బాధ్యతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)కు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది.  ఇప్పటికే నరేంద్ర మోదీ పర్యటనను ప్రధాని కార్యాలయం ఖరారు చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో నిన్ననే కమిటీల నియామకం జరిగింది.