ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ‘నాటు నాటు’ పాట పాడిన తెలంగాణ యువకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నజరానా ప్రకటించారు. రాహుల్ కు రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. శుక్రవారం (మే 12) సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటిటేషన్ జరిగింది. ఈ రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభానికి రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ యువతలో మేధో సంపత్తిని బయటికి తెచ్చేందుకు ఈ క్విజ్ ఏర్పాటు చేశారని చెప్పారు.


ఈ ప్రోగ్రాం ప్రారంభానికి రాహుల్ అతిథిగా వచ్చారని, జూన్ 2న జరిగే క్విజ్ ప్రోగ్రాంలో బహుమతులు ఇవ్వడానికి ప్రియాంక గాంధీ వస్తారని చెప్పారు. ఆ రోజు రాహుల్ సిప్లిగంజ్‌కు పెద్ద ఎత్తున సన్మానం చేస్తామని చెప్పారు. ఇవాళ రాహుల్ సిప్లిగంజ్ వచ్చినప్పుడు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని అన్నారు.


పేద కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయికి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ ను  రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తుందని అనుకున్నానని అన్నారు. కానీ సన్మానం చేయకుండా నిరాశకు గురి చేసిందని అన్నారు. రాహుల్ సిప్లిగంజ్ కి కాంగ్రెస్ పార్టీ తరపున 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు. కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారంలోకి రాగానే రాహుల్ సిప్లిగంజ్ కు రూ.కోటి రూపాయల నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు. ఆర్టిస్టులను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీవీలో ఆస్కార్ అవార్డులు చూడటం తప్ప, ఆస్కార్ అవార్డ్ అందుకున్న వారు తెలుగులో లేరని రేవంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ యూత్ వింగ్ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.