Hyderabad News: ఇటీవల మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో 16 మందిలో 11 మంది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన వారు కాగా.. మిగతా ఐదుగురు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. అయితే అరెస్టయిన ఉగ్రవాదుల వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
హిజ్బ్ ఉత్ తహరీర్ - హెచ్‌యూటీ ఉగ్ర సంస్థ హైదరాబాద్ భారీ ఎత్తున పేలుళ్లకు పథక రచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల కోసం వారు మూడంచెల విధానాన్ని అనుసరించినట్లు అధికారులు గుర్తించారు. తొలి దశలో యువతీ యువకులను ఆకర్షించి తమవైపు తిప్పుకుంటారు. రెండో దశలో వారికి సాంకేతికత, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో వారితో దాడులు చేయిస్తారు. వీరందరితో కలిసి మూకుమ్మడిగా దాడులు చేసి భయానక పరిస్థితి సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరు ఆకర్షించిన యువకులకు వికారాబాద్ లోని అనంతగిరి కొండల్లో తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో ఎలా దాడి చేయాలో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్, హైదరాబాద్ లలో ఏకకాకంలో దాడులు చేసి 16 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్ కు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. బుధవారం మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేయడంతో వారి సంఖ్య 17కు చేరింది.
తరచూ సమావేశం నిర్వహిస్తూ వారివైపు తిప్పుకున్నారు..!
హైదరాబాద్ లో హిచ్బ్ ఉత్ తహరీర్ -హెచ్‌యూటీ తరఫున కార్య కలాపాలు నిర్వహించే బాధ్యతను ఓ కాలేజీలో హెచ్‌వోడీగా పని చేస్తున్న మహ్మద్ సలీమ్ అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. మహ్మద్ సలీమ్ గోల్కొండ బడాబజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నిందితులు అంతా కలిసి అతని నివాసంలోనే ఎక్కువ సార్లు సమావేశం అయినట్లు అధికారులు తెలిపారు. అబ్దుర్ రెహ్మాన్, మహ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్, మహ్మద్ సల్మాన్ తో పాటు మరి కొందరు యువకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. వీరితో తరచూ సమావేశం నిర్వహిస్తూ అజెండాను వివరిస్తూ తమవైపు తిప్పుకున్నారు. నిందితులు అరెస్టు కాకముందు వివిధ ప్రాంతాల్లో కలిసిన వ్యక్తుల కోసమూ గాలింపు నిర్వహిస్తున్నారు. అలాగే వారు కొన్ని నెలలపాటు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించినందున ఏయే ప్రాంతాలకు వెళ్లారు.. ఎవరిని ఎందుకోసం కలిశారు అనే కోణంలో ప్రత్యేక బృందాలతో నాలుగు ప్రాంతాల్లో విచారణ సాగిస్తున్నారు.
యువతీ యువకులను ఆకర్షించేందుకు యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు
యువతీ యువకులను ఆకర్షించి, తమ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నిందితులు ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించారు. ఇందులో మతమార్పిడి, ఇతర అంశాలకు సంబంధించి 33 వీడియోలు అప్ లోడ్ చేశారు. దాదాపు 3 వేల 600 మంది దీన్ని సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. మత మార్పిడి అంశంపై ప్రసంగిస్తున్న మహిళను నిందితుల్లో ఒకరి భార్యగా పోలీసు అధికారులు గుర్తించారు.