పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో సంచలనం వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి రామకృష్ణ తాను ఆత్మహత్య చేసుకోబోయే ముందు రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇందులో ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. సూసైడ్ నోట్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ పేరు రాసి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజా సెల్ఫీ వీడియోలో వనమా రాఘవ తమను ఎలా వేధించాడో బాధితుడు వివరించారు. తన భార్యను తీసుకురమ్మని వనమా రాఘవ బెదిరించినట్లుగా, గతిలేని పరిస్థితుల్లో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వివరించారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న రేవంత్ రెడ్డి
ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రేవంత్ ట్వీట్ చేశారు. ‘‘రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరాచకాలు వెలుగుచూశాయి. వెంటనే అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోండి’’ అని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని డిమాండ్ చేశారు.
‘‘ఎమ్మెల్యే పుత్రరత్నం వనమా రాఘవ లాంటి మానవమృగానికి అధికార టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గం. రాఘవ కీచక చేష్టలకు రామకృష్ణ కుటుంబం బలై మూడు రోజులైనా చర్యలెందుకు లేవు? మొదటి రోజు నుంచే రాఘవ పేరు తెరమీదకు వచ్చింది. అరెస్టు ఎందుకు చేయలేదు… ఎవరు కాపాడుతున్నారు? ఎమ్మెల్యే కుమారుడు ఇన్నీ అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కి తెలియకపోవడం ఏమిటి? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ప్రతిపక్ష నాయకుల ప్రజాపోరాటాలపై నిఘాకే పరిమితం అయిందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి వారసులు భూకబ్జాలు, సెటిల్మెంట్లలో మాఫియాను మించిపోయారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఒకనాటి బీహార్ ను తలపిస్తోంది. సిగ్గు సిగ్గు.’’ అని రేవంత్ రెడ్డి వీడియో కూడా విడుదల చేశారు.
ఆ సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చేసిన ఆరోపణలు ఇవీ..
‘‘వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఏ భర్త వినగూడని మాట వనమా రాఘవ నన్ను అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడు. పిల్లల్ని వదిలేసి భార్యను తీసుకురావాలని కోరారు. నా భార్యను పంపిస్తే తన ఆస్తి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. నాకు ఏం చేయాలో తోచలేదు. నేను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే.. నా భార్యను ఏమైనా చేస్తారు. పిల్లలు అన్యాయం అవుతారు. నా భార్యకు ఈ విషయం తెలియదు. నేను చేసేది తప్పు అని తెలిసినా ఇంకా ఎవ్వరికీ అన్యాయం జరగొద్దని ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఎంత మందితో చెప్పుకున్నా నీ సమస్య పరిష్కారం కాదు.. నీ ఆస్తి నయా పైసా కూడా నీకు రాదు.. అని వనమా రాఘవ బెదిరించాడు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి?’’
‘‘నేను ఏంటో మా వీధిలో అందరికీ తెలుసు. 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఏ రోజు ఏ పొరపొచ్చాలు లేకుండా చేసుకున్నాను. అన్ని రకాల హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. ఏ రకంగా నేను నా భార్యను పంపించగలను. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టకండి. ఇలాంటి దుర్మార్గులను మాత్రం ఎదగనివ్వొద్దు.’’ అని రామకృష్ణ గోడు వెళ్లబోసుకున్నాడు. ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.
Also Read: Hyderabad: రెండో భర్త పోయినా బాధలేని భార్య.. ఒకేసారి మరో ఇద్దరితో అఫైర్, చివరికి..
Also Read: ఇద్దరు భర్తలు.. ఓ భార్య.. మధ్యలో ఇద్దరు పిల్లలు.. ఇది రియల్ "బతుకు జట్కాబండి" స్టోరీ !