ఢిల్లీలో రైతు చట్టాల ఉద్యమంలో పాల్గొని చనిపోయిన రైతులకు రూ.3 లక్షల పరిహారం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చని సీఎం కేసీఆర్.. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా రేవంత్ ప్రశ్నించారు.
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 7,500 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం మరో 40 వేల మంది చనిపోయారని అన్నారు. ఇంతవరకు ఇక్కడ వారి కుటుంబాలను ఆదుకోలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వరదలు వచ్చినప్పుడు ఇస్తామన్న రూ.10 వేల వరద పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇలా ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటే ఎలా నమ్మాలని రేవంత్ రెడ్డి ట్విటర్‌లో రాశారు.
రైతు ఉద్యమంలో అమరులైన వారికి రూ. 22.5 కోట్ల పరిహారం !
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో అమరులైన వారిలో ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించారు. 700 నుంచి 750మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. అందరికీ పరిహారం ఇచ్చేందుకు ₹22.5 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. అమరులైన రైతుల వివరాల కోసం రైతు సంఘటన్ నేతల్ని సంప్రదించి అమరులైన రైతుల కుటుంబాలను మంత్రులు, అవసరమైతే తాను వెళ్లి స్వయంగా కలిసి ఎక్స్‌గ్రేషియో అందిస్తామని ప్రకటించారు.
అలాగే కేంద్రం కూడా ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులపై వేలాది కేసులన్నీ ఎత్తివేయాలని రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశం ద్రోహం కేసులు కూడా పెట్టారని అన్నారు. అమాయకులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Also Read : ‘మోదీ రాక్షసుడు.. ఆ చట్టాలు అప్పుడే రద్దు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది’: రేవంత్ రెడ్డి
Also Read : అధికారం కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పదే.. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్