Farmer loan waiver news In Telangana: తెలంగాణలో రైతు రుణ మాఫీ చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీస్తూ వచ్చారు. కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. అయితే ఆగస్టును డెడ్‌లైన్‌గా ప్రకటించిన ప్రభుత్వం ప్రతిపక్షాలకు గట్టిసవాల్ చేసింది. అప్పటి నుంచి రాజకీయం మరింత రంజుగా మారింది. రుణమాఫీ విధివిధానాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విధివిధానాలకు సంబంధించి తాజాగా మరో విషయం తెరపైకి వచ్చింది.
దీనిపై భారీగా ఆంక్షలు విధిస్తున్నారని కోతలు ఖాయమనే ప్రచారం నడిచింది. అటు బీఆర్‌ఎస్ కూడా దీనిపై రియాక్ట్ అయింది. లేని పోని సాకులతో రుణమాఫీలో కోతలు కోస్తే మాత్రం ఊరుకునేది లేదని రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఇప్పుడు లేటెస్టుగా అందుకున్న సమాచారం ప్రకారం... బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాపీ చేసింది. దీనికి అనుసరించిన విధివిధానాలనే ఈసారి కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం.
ఇప్పటికే రుణాలకు సంబంధించిన కటాఫ్ తేదీని ప్రభుత్వం ప్రకటించింది. 12 డిశంబర్ 2018 నుంచి 9 డిశంబర్ 2023 వరకు ఉన్న 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు. 18 నెలల కాలపరిమితతో స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ పథకం వర్తిస్తుంది.
రేషన్ కార్డుగా ప్రామాణికంగా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని మాఫీ లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ కుటుంబాలను గుర్తించే బాధ్యతను ఏఈవోలకు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఎన్ని బ్యాంకుల్లో ఎంత అప్పులు ఉన్నా 2 లక్షల వరకు మాఫీ అవుతుంది.
డూప్లికేషన్, డబుల్ పేమెంట్ సమస్య లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అనెక్సర్ ఏ బీల్లో ఉన్న వివరాలను అనెక్సర్ సీలో పొందుపరుస్తారు. వీటని బ్యాంకు మేనేజర్లు తమ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసుకొన్న తర్వాత డూప్లికేషన్, డబుల్ పేమెంట్ సమస్య లేకుండా చూసే బాధ్యతను మండల స్థాయి సంయుక్త బ్యాంకర్ల కమిటీకి అప్పగిస్తారు. అక్కడే నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లను కూడా గుర్తించి డిలీట్ చేస్తారు. మండల స్థాయిలో మొదలయ్యే వడపోత ప్రక్రియ చివరకు వ్యవసాయ శాఖ ఐటీ విభాగానికి చేరుకుంటుంది.
వ్యవసాయ శాఖ ఐటీ విభాగం స్క్రూట్నీ చేసిన జాబితాను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. అనంతరం అదే జాబితాను గ్రామ పంచాయతీలు, బ్యాంకుల వద్ద డిస్‌ప్లే చేస్తారు. వాటిపై అభ్యంతరాలను ప్రజలు తెలియజేయవచ్చు. అప్పుడు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
మరోవైపు రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణకి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. రైతు భరోసా కోసం కేటాయించిన నిధులను కూడా ఇటు మళ్లించి తర్వాత వాటికి సర్దుబాటు చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తర్వాత భరోసా విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఇంతలో ఆ 7500 కోట్ల నిధులు రుణమాఫీ కోసం వాడుకోవాలని చూస్తోంది.