Cabinet Expansion in Telangana | హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు శుభవార్త అందనుంది. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మరో ఐదారుగురు నేతలకు తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కనుందని చెప్పారు. శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్న మంత్రి దామోదర.. మంత్రి సీతక్కకు హోం శాఖ దక్కే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ లకు సైతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కవచ్చు అన్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ లేదన్నట్లుగా మాట్లాడారు. కేబినెట్ విస్తరణపై ఆయనకు ఆసక్తి లేదని సైతం పార్టీలో వినిపించింది. అయితే పలువురు సీనియర్లు మాత్రం మంత్రివర్గంలో చోటు కోసం ఢిల్లీ పర్యటనలు చేసి కాంగ్రెస్ పెద్దలను సైతం కలిశారు. కాగా, తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉండగా.. కీలక మంత్రిత్వ శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి.
ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన
టీపీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమచారం. బీసీ నేత కావడం, ఎన్ఎస్‌యూఐ, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడం మహేశ్వర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యి తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు రాష్ట్ర మంత్రివర్గం విస్తరణపై చర్చలు జరిపారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కంటోన్మెంట్ ఏరియాలో కేంద్రం నుంచి అనుమతులు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పలు విషయాలపై కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి వరుస భేటీలలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పనులలో, ప్రాజెక్టులలో పూర్తిగా సహకారం ఉంటుందని, అయితే కేంద్రం నుంచి నిధుల కావాలని, కొన్ని అభివృద్ది పనులకు అనుమతులు సైతం కోరారు.
Also Read: Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
తెలంగాణలో మంత్రులు, వారి శాఖలు ఇవీ
- హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు - సీఎం రేవంత్ రెడ్డి
- డిప్యూటీ, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి - భట్టి విక్రమార్క
- వ్యవసాయ, చేనేత శాఖల మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు
- ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి - జూపల్లి కృష్ణారావు
- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ - సీతక్క
- నీటిపారుదల, పౌరసరఫరాల శాఖలు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ - దామోదర రాజనర్సింహ
- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ - కొండా సురేఖ
- ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాలు - శ్రీధర్ బాబు
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ - పొన్నం ప్రభాకర్
- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి