First FIR with Digital Signature in Telangana  | హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నేటి (జులై 1) నుంచి కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై చార్మినార్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత చట్టాల రూల్స్ ప్రకారం సెక్షన్ 281 బీఎన్ఎస్, మోటార్ వెహికల్ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఎఆర్ (FIR) ను డిజిటల్ గా నమోదుచేశారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ తెలిపారు. 


ఢిల్లీలో తొలి కేసు నమోదు 
దేశ వ్యాప్తంగా 3 కొత్త క్రిమినల్ చట్టాలు నేడు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు ఢిల్లీలో రిజిస్టర్ అయింది. ఓ వీధి వ్యాపారి రోడ్డుని బ్లాక్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సన్హిత (Bharathiya Nyaya Sanhitha)లోని Section 285 కింద FIR నమోదు చేయడం తెలిసిందే. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఎలాంటి హక్కు లేకుండానే ఓ ప్రాపర్టీపైన అధికారం చెలాయించడం, ఆక్రమించడం, ప్రమాదాలకు కారణం కావడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం లాంటి పనులకు రూ.5 వేల జరిమానా విధిస్తారు.  






కొత్త చట్టాలతో వచ్చిన మార్పుల్లో కొన్ని..
భారతీయ న్యాయ సన్హిత చట్టాలు సోమవారం (జులై 1) నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించడానికి, వారిలో మార్పు రావడానికి చట్టాలు దోహదం చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల ప్రకారం.. బాధితులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ (Online Complaint) ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు.


అరెస్టు అవుతున్న సమయంలో బాధితులు తమ సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు లభిస్తుంది. దాంతో బాధితులు తమ పరిస్థితిని తెలిపి.. తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. నిందితుల అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో పోలీసులు ప్రదర్శిస్తారు. హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా ఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు.ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి చేయాలని చట్టాలు చెబుతున్నాయి. దీనివల్ల కేసు దర్యాప్తులో పారదర్శకత ద్వారా, చట్టాలపై విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.