తెలంగాణ రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభం అయ్యాయి. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతి కుమారి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం నుంచి మంత్రులు, ఇతరులు ఎవరూ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రసంగం చివర్లో కూడా గవర్నర్ తెలుగులో మాట్లాడుతూ ముగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందామని అన్నారు.
కొంత మందికి నేను నచ్చకపోవచ్చు - తమిళిసై
‘‘కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు - నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం - రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను.’’ అని గవర్నర్ తమిళిసై మాట్లాడారు.
రాజ్ భవన్ సహకారం
‘‘ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ అనుసంధానమై ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వందేభారత్ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోంది’’ అని తమిళిసై మాట్లాడారు.
ప్రముఖ కవి దాశరథి క్రిష్ణమాచార్యను, సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను తమిళిసై సర్మించుకున్నారు. ‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అన్నారు. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదని, అభివృద్ధి అంటే జాతి నిర్మాణం అని అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ దూరం
హైదరాబాద్ రాజ్ భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. సాయంత్రం గవర్నర్ ఎట్ హోం పేరుతో ఇచ్చే విందుకు కూడా కేసీఆర్ రారని తెలిసింది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఆయన విముఖంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం (జనవరి 26న) ఉదయం ఆయన ప్రగతి భవన్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర జవానుల స్మారక స్తూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించనున్నారు.