రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల హడావిడిలో సీఎం ప్రదక్షిణ చేస్తూ.. చేతులెత్తి ఓట్లు అడుక్కుంటున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఏం చేశారని ఓట్లు వేయాలని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో సోమవారం (అక్టోబరు 30) రేణుకా చౌదరి విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘చట్టానికి విరుద్ధంగా 18 ఏళ్ళ లోపు అమ్మాయిలకు వివాహాలు జరుగుతున్నాయి. ఆడ పిల్లలకు చదువు కోసం కాంగ్రెస్ పార్టీ విద్యా హక్కు చట్టం తెచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ ఇచ్చి దాన్ని మర్చిపోయింది. ఆడపిల్లలకు కనీస అవసరాలు లేకపోవడం వల్ల మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. తెలంగాణలో కేవలం కవిత ఒక్కరు మాత్రమే బాగుపడ్డారు. మొదటి కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేదు. రెండో సారి కాబినెట్ లో అవకాశం కల్పించారు. ఒక మహిళ అభిప్రాయంతో సామాజిక న్యాయం జరుగుతుందని మేం ఆలోచన చేశాం’’ అని రేణుకా చౌదరి అన్నారు.


కేసీఆర్ ప్రభుత్వం యూజ్ లేస్ ప్రభుత్వం అని అన్నారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ చెప్పారని.. బంగారం లేదు.. అప్పులే మిగిలాయని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతులకు డబ్బులు ఇచ్చారు కానీ.. కానీ, తెలంగాణలోమహిళా రైతులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు మేం ఇచ్చిన పావలా వడ్డీ ఎక్కడ? మేం ఇచ్చిన నిత్యావసరాలు బంద్ చేశారు.. మహిళా ఓట్లతోనే కాంగ్రెస్ గెలుస్తోందని రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. మా చేతుల గాజులు.. విష్ణు చక్రాలుగా మారిపోతున్నాయని మాట్లాడారు. కేసీఆర్ కు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని.. పార్టీ పేరులోనే తెలంగాణ తీసేశారని అన్నారు.


‘‘నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధర పెరగడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలను ఈ విధంగా మోసం చేసిన మీకు ఓటు వేయ్యాలా? చేతగాని అసమర్థ ప్రభుత్వం ఇది. 18 సంవత్సరాల నుంచి ఓటు వేసేలా హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్న మహిళా రిజర్వేషన్ ను 50 శాతానికి పెంచింది. కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో కమ్మ, బీసీ సామాజిక వర్గాలకు ఇంకా ప్రాధాన్యం ఇవ్వాల్సింది’’ అని రేణుకా చౌదరి మాట్లాడారు.