Telangana Assembly Elections 2023: రాజకీయ నాయకుడికి ప్రతి ఎన్నిక కూడా పరీక్షే. అభివృద్ధి పనులు చేస్తూనే ప్రజలను, అనుచరులను మెప్పిస్తూ ఉండాలి. అంతే కాకుండా మారుతున్న ట్రెండ్‌ను గమనిస్తూ రాజకీయం చేస్తుండాలి. లేకుంటే ప్రజలను మెప్పించి విజయం సాధించడం అంత ఈజీకాదు. అలాంటి కొన్ని దశాబ్ధాల పాటు ఓటర్ల నాడి పసిగట్టి వారి మన్ననలు పొందుతున్న వారు ఇప్పుడు మరో పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. 


తెలంగాణలో చాలా మంది సీనియర్లు పొలిటికల్ ఫిట్‌నెస్‌ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ రాజకీయం మాత్రం రసవత్తరంగా సాగుతోంది. భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్), కాంగ్రెస్, బిజెపి, సహా ఇతర పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ తమను తాము బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.


వీరిలో చాలా మంది ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి  ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసి అధ్యక్షా అన్నవాళ్లు ఉన్నారు. ఐదు కాదు ఏకంగా 8 సార్లు గెలిచిన వారు ఉన్నారు. 


8సార్లు విజయం సాధించిన కేసీఆర్‌ టాప్‌ 
ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన పదవీకాలం 1985, 1989, 1994, 1999, 2001. ఆ తర్వాత 2004, 2014, 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.


చంద్రశేఖర రావు తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ఉన్నారు. వీరిద్దరూ ఏడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జానారెడ్డి 1983, 1985లో టీడీపీ తరఫున గెలిచారు. 1989, 1999, 2004, 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు.


గెలుపు సిక్సర్ కొట్టిన వాళ్లు 
ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నాయకులు చాలా మందే ఉన్నారు. వీరిలో జి.గడ్డెన్న, టి.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సి.రాజేశ్వర్ రావు, టి.హరీశ్ రావు, డాక్టర్ ఎం.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా, రాఘవ్ రెడ్డి ఉన్నారు.


ప్రత్యర్థులపై పంచ్‌ విసిరిన నేతలు  


ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జె.రాజారాం, గంప గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.వి.వి.రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసీ, సలావుద్దీన్ ఒవైసీ. అమానుల్లాఖాన్, జి.సయానా, డాక్టర్ పి.శంకర్రావు, గుర్నాథరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.గోవర్ధన్‌ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ.