ఇన్న సమస్యను పరిష్కరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు శ్రీకారం చుట్టారు. వీధుల్లోని కరెంటు స్తంభాలకు కరెంటు తీగలతో పాటు వివిధ రకాల వైర్లు చిక్కుల మాదిరిగా గజిబిజిగా ఉండే సంగతి తెలిసిందే. చాలా తీగలు కిందికి వేలాడుతూ కూడా ఉంటాయి. వాటిలో ఏ తీగలో కరెంటు ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల స్తంభాలకు కూడా కరెంటు ప్రసరణ జరిగే పరిస్థితి ఉంది. ఈ సమస్య కారణంగా గతంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.


విద్యుత్ స్తంభాలపై ఉన్న అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టీజీఎస్పీడీసీఎల్ ఆదేశించింది. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ హెచ్చరించారు. జులై 27, ఆగస్టు 7, ఆగస్టు 28 తేదీల్లో అనవసరమైన కేబుల్స్ తొలగింపుపై కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇచ్చేందుకు సమావేశాలు నిర్వహించారు. ఆగస్టు 7న జరిగిన సమావేశంలో ప్రధాన రహదారులపై వారం రోజుల్లోగా, ఇతర ప్రధాన రహదారులపై రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుల్స్ ఏర్పాటు చేసేందుకు ఆపరేటర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.


కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ తొలగింపు ప్రక్రియలో సహకరించలేదు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్, కేబుల్ బండిల్స్, వివిధ టెలికాం పరికరాలు కారణంగా పలు ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేబుల్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సామాన్య ప్రజలు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లు సంభవించడంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై అదనపు భారం పడుతుండడంతో అవి వంగిపోతున్నాయి. అంతేకాకుండా స్తంభాలపై తీగలు తెగిపోవడంతో వాటి నిర్వహణ పనుల్లో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.