Runa Mafi In Telangana: తెలంగాణాలో రైతు రుణమాఫీపై తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదూమారం రేపుతున్నాయి. హరీష్ రావు, కేటీఆర్ గ్రామాలవారిగా పర్యటించి రుణమాఫీ పొందని రైతుల వివరాలు ఇవ్వాలంటూ సవాలు విసిరారు. ఈ సవాల్‌తో మరోసారి రాజకీయాల్లో అగ్గిరాజేశారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు అతీతంగా రైతులకు రుణమాఫీపై వాస్తవాలేంటని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం. 


మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భౌరంపేట కోపరేటివ్ సొసైటిని పర్యటించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్దితులను తెలుసుకునేందుకు రుణాలు పొందిన రైతులతో మాట్లడింది. ఈ పర్యటనలో భౌరంపేట సొసైటిలో రుణమాఫీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 


భౌరంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 13 గ్రామాలు ఉన్నాయి. భౌరంపేట,దుండిగల్ ,మల్లంపేట్, డి.పోచంపల్లి, నిజాంపేట్,గాజులరామారం, సూరారం,కుత్బుల్లాపూర్.. ఇలా 13 గ్రామాల రైతులకు భౌరంపేట సొసైటీయే ఆధారం. ఈ సొసైటీ పరిధిలో 632 మంది రైతులు గతంలో రుణాలు పొందారు. వీరంతా రెండులక్షలలోపు రుణాలు తీసుకున్నావారే. అందరూ రైతు రుణమాఫీకి పూర్తి స్థాయి అర్హత ఉన్నవారే. వీరిలో కొందరు రైతులతో మాట్లడింది ఏబిపి దేశం.


డి.పోచంపల్లికి చెందిన రైతు విజేంద్రరెడ్డి రుణమాఫీపై ఏమన్నారంటే..." నేను తొంభైతొమ్మిది వేల రూపాయలు పంటరుణం తీసుకున్నాను.నాకు రుణమాఫీ కాలేదు. ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారంటే దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు మాఫీ కాలేదు అని అధికారులను అడిగితే సమాధానం చెప్పలేదు. ఆధార్ కార్డ్, పాస్ బుక్, అప్లికేషన్ ఇచ్చాను. పరిశీలిస్తామని ఇక్కడి అధికారులు చెప్పారు. కొందరికి వచ్చి, ఎక్కువ మందికి ఎందుకు ఆగిందో అర్ధంకావడంలేదు."


భౌరంపేటకు చెందిన చంద్రారెడ్డి ఏమన్నారంటే.. " నేను లక్షరూపాలు పంట రుణం తీసుకున్నాను. ప్రతీ ఆరునెలలకోసారి వడ్డీ కట్టేవాణ్ని. ఈ నెల 16 తరువాత వడ్డీ కట్టేందుకు సొసైటీకి వెళ్తే, ఏడువేల రూపాయలు వడ్డీ కట్టాను. రుణం మాఫీ అయ్యిందని అధికారులు చెప్పారు. బ్యాంక్‌లో ఉన్నా పాస్ బుక్ సైతం వెనక్కి తెచ్చుకున్నాను."


భౌరంపేటకు చెందిన విజయారెడ్డి మాటల్లో.. " నాకు రుణమాఫీ కాలేదు. నేను ఎస్‌బిఐలో లక్షా నలభై వేలు పంట రుణం తీసుకున్నాను. రెండు నెలల క్రితం వడ్డీ కూడా కట్టేశాను. మరో బ్యాంక్‌లో కూడా రుణం తీసుకున్నాను. ఒక్కచోట కూడా రుణమాఫీ కాలేదు. అడిగితే వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లమని చెప్పారు. ఇక్కడ అడిగితే తికమకమైందని అంటున్నారు సొసైటీ అధికారులు. అతి తక్కువ మందికి మాత్రమే అంటే రూపాయిలో పావువంతు మందికి కూడా మా సొసైటీ పరిధిలో రుణమాఫీ కాలేదు."


భౌరంపేటకు చెందిన అశోక్ ఏమన్నారంటే.. " నాకు ఎకరం 32 కుంటల భూమి ఉంది. నేను 28వేలు పంట రుణం తీసుకన్నాను. మొత్తం మాఫీ అయ్యింది. ఫోన్ మెసేజ్ ద్వారా సమచారం వచ్చింది.


భౌరంపేట సొసైటికీ చెందిన బలరామ్ రెడ్డి మాటల్లో.. "నేను సొసైటీలో 80 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ కాలేదు. ఆధార్, రేషన్ కార్టులు జిరాక్స్ తీసుకురమన్నారు వ్యవసాయశాఖ అధికారులు. సమస్యను పరిష్కరించి త్వరగా రుణమాఫీ చేయాలని కోరుతున్నాము." 


ఇలా భౌరంపేట సొసైటీ పరిధిలో రుణాలు పొందిన కొందరు రైతులను వచ్చిన సమాచారం ఆధారంగా ఏబిపి దేశం అధికారుల వద్దకు వెళ్లింది. భౌరంపేట సొసైటీ పరిధిలో రుణమాఫీ సమస్యలపై వ్యవసాయశాఖ అధికారిని పశ్నించింది..


అగ్రికల్చర్ ఆఫీసర్ యాదగిరి ఏమన్నారంటే.. " భౌరంపేట కోపరేటివ్ సొసైటీ పరిధిలో పదమూడు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలో మొత్తం 632 మంది రైతులు గతంలో పంట రుణాలు పొంది రుణమాఫీకి అర్హత కలిగి ఉన్నారు. వారిలో మొదటి దశలో 11మందికి, రెండో దశలో ఒకరికి, మూడో దశలో ఇద్దరికి మొత్తంగా మూడుదశల్లో కలిపి 14మంది రైతులకే రుణమాఫీ వర్తించింది. భౌరంపేట సొసైటీ పరిధిలో మొత్తం రుణాలు రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు మాఫీ కావాల్సి ఉండగా నాలుగు లక్షల 31 లక్షలు మాత్రమే మాఫీ జరిగింది.


Also Read:  హైడ్రా మరో సంచలన నిర్ణయం! ఆ ఆఫీసర్లపై కూడా క్రిమినల్‌ కేసులు


మిగతా రైతులు 618 మంది అర్హత ఉండికూడా రుణమాఫీ పొందలేదు. ఆధార్ కార్ట్‌లొ రైతు పేరు, రుణమాఫీ పోర్టల్‌లో పేరు వేరుగా చూపించడం జరుగుతోంది. కుటుంబ సభ్యుల నిర్దారణ ఇలా 33 రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అర్హులైన రైతులకు సైతం రుణమాఫీ రాకపోవడపై సొసైటీ కార్యాలయంలోనే గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నాం. ఆధార్, రేషన్ ,పాస్ బుక్ జిరాక్స్‌లతోపాటు అన్ని వివరాలు తీసుకుని ఉన్నతాధికారుల సహకారంతో సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము." అని వివరణ ఇచ్చారు.


Also Read: రాంనగర్‌లో 'హైడ్రా' కూల్చివేతలు - ఫిర్యాదు చేసిన రెండ్రోజుల్లోనే చర్యలు