Hyderabad News: హైదరాబాద్‌ లో అక్రమ నిర్మాణాల అంతు చూస్తున్న హైదరాబాద్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా చెరువులు, కుంటలను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇప్పుడు ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా ఫోకస్ చేసింది. నిషేధిత ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్‌ కేసులకు రెడీ అయింది. 


దీనికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్‌కు హైడ్రా సిఫార్సు చేసింది. హెచ్‌ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల లిస్టును కూడా రెడీ చేయిస్తున్నట్టు తెలిసింది.


అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారే కాక, వారికి అనుమతులు ఇచ్చి నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకు కూడా హైడ్రా దెబ్బ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన భవంతులపై హైడ్రా పెద్దఎత్తున కూల్చివేయిస్తున్నందున.. ఆ కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల జాబితాను రెడీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 18 ప్రాంతాల్లో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల అక్రమాల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.