Tammareddy Bharadwaja About Hema Case: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమకు రీసెంట్ గా ‘మా’ గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెపై విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. రేవ్ పార్టీ కేసులో హేమకు బెయిర్ రావడం వల్లే ‘మా’ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పారు. ఒకవేళ విచారణలో ఆమె దోషిగా తేలితే మళ్లీ నిషేధం విధించే అవకాశం ఉంటుందన్నారు.
హేమ ప్రస్తుతం నిందితురాలు మాత్రమే- భరద్వాజ
రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ ప్రస్తుతం కేవలం నిందితురాలిగానే ఉందని భరద్వాజ వెల్లడించారు. “ హేమ విషయంలో ‘మా’ వెనక్కి తగ్గడం ఏముంది? బెయిల్ వచ్చింది కాబట్టి వదిలేసి ఉంటారు. చట్టం దృష్టిలో నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నేరం నిరూపణ అయ్యే వరకు ఆమె నిందితురాలే. ఆమెను అరెస్టు చేశారు కాబట్టి, ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. ప్రస్తుతం ఆమెకు బెయిల్ వచ్చింది కాబట్టి, నిజా నిజాలు తెలిసేంత వరకు ఆమె నిందితురాలిగానే ఉంటుంది. నింద అనేది ఎవరి మీదైనా పడొచ్చు. అందుకే ఆమెకు సభ్యత్వం ఇచ్చారు. విచారణలో నేరస్తురాలు అని తేలితే మళ్లీ తొలగిస్తారు” అని భరద్వాజ చెప్పారు.
డ్రగ్స్ కేసులో హేమ మాత్రమే అరెస్టు అయ్యింది-భరద్వాజ
డ్రగ్స్ విషయంలో ఇప్పటి వరకు టాలీవుడ్ లో హేమ మినహా మరెవరూ అరెస్టు కాలేదన్నారు భరద్వాజ. “డ్రగ్స్ విషయంలో చాలా మంది నటీనటులు విచారణకు వెళ్లారు. కానీ, ఎవరూ అరెస్టు కాలేదు. కేవలం హేమ మాత్రమే అరెస్టు అయ్యింది. ఇంతకీ ఈ కేసుకు సంబంధించి లా ఏం చెప్తుంది అనేది నాకు తెలియదు. డ్రగ్స్ తీసుకుంటే జైల్లో పెడతారా? పెట్టరా? తెలియదు. ఒకవేళ పెడితే, ఈ కేసులో ఉన్న వాళ్లందరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు? బెంగళూరు రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు దొరికాయా? దొరికితే వీళ్లు బయట ఎందుకు ఉన్నారో తెలియదు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు 15 ఏళ్ల నుంచి జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి పిలుస్తారు. ఎంక్వయిరీ చేస్తారు. ఆ వార్తలు మీడియాలో చూపిస్తారు. ప్రజలు పిచ్చొళ్ల లాగా టీవీల ముందుకు కూర్చొని చూస్తారు. విచారణకు వచ్చిన వాళ్లు నవ్వుతూ వెళ్తారు. విక్టరీ సింబల్స్ చూపిస్తారు. చేతులు ఊపివెళ్లిపోతారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు లోపల వేయరో తెలియదు. ఎందుకు వదిలేశారో తెలియదు” అన్నారు.
యువత చెడిపోవానికి కారణాలు రెండే- భరద్వాజ
ప్రస్తుతం డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతున్నాయని భరద్వాజ చెప్పారు. “స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, పబ్బుల దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి. డ్రగ్స్, ప్రోర్నోగ్రఫీ వల్ల సమాజంలో రేప్ లు పెరుగుతున్నాయి. స్కూళ్లలో జరిగే చాలా కేసులు బయటకు రావడం లేదు. అలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. డ్రగ్స్, ఫోర్నోగ్రఫీని అరికట్టాలని గత 15 ఏళ్ల నుంచి నేను పోరాటం చేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
Read Also: రేవ్ పార్టీ కేసు - ఆ షరతుతో నటి హేమపై ‘మా’ కీలక నిర్ణయం, ఇంతకీ ఏం జరిగిందంటే?