Ganesh Navarathri Utsav: గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో గణేష్ మండపాల ఏర్పాటు, ఊరేగింపు నిర్వహించే విషయంలో కీలక సూచనలు చేశారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించడం కోసమే ఈ సమావేశం నిర్వహించామని సీఎం చెప్పారు.
‘‘గణేష్ నవరాత్రి ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వానికి, నిర్వహకులకు మధ్య సమన్వయం ఉండాలి. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశిస్తున్నా. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించేలా జాగ్రత్త వహించండి. నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వహకుల నుంచి సహకారం అవసరం.
ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతీ ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలి. వీవీఐపీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించాలి. సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైంది. సెప్టెంబర్ 17న జరిగే రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరం’’ అని రేవంత్ రెడ్డి సూచించారు.
మిలాద్-ఉన్- నబీ ఏర్పాట్లపై కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సమీక్షకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్,ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, ఉన్నతాధికారులు, వక్ఫ్ బోర్డు చైర్మన్, సభ్యులు, ఇతర ముస్లిం ప్రతినిధులు హాజరయ్యారు.
మూడు ప్రధాన అంశాలు
మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు.
అవుటర్ రింగు రోడ్డు పరిధిలో గతేడాది 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారనే లెక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా మండప నిర్వహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. సరూర్ నగర్‌తో పాటు పలు చెరువులు నీటితో ఉన్నాయని, ఏ ప్రాంతంలోని విగ్రహాలు ఆ ప్రాంతంలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తే హుస్సేన్ సాగర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందన్నారు. ఈ విషయంలో ఉత్సవ సమితి సభ్యులు, మండప నిర్వాహకులు ముందగానే సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా ఎవరినైనా పిలిస్తే ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, అలాగే వీవీఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే ముందుగా తెలియజేస్తే పోలీసు శాఖ వారి రాకపోకలకు రూట్ క్లియరెన్స్ చేయడంతో పాటు తగిన భద్రత ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిమజ్జన ఊరేగింపు త్వరగా ప్రారంభిస్తే త్వరగా కార్యక్రమాన్ని ముగించుకోవచ్చని, ఫలితంగా భక్తులు ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని నలుగురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు.