ప్రముఖ బైక్ హైరింగ్ సంస్థ ర్యాపిడోకు చుక్కెదురైంది. తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ర్యాపిడో ప్రకటనలో ఓ సన్నివేశం ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా తీవ్రంగా స్పందించారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఆ ప్రకటనను ప్రసారం చేయడం నిలిపివేయాలంటూ ర్యాపిడోను హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
గతంలోనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు అధికారులు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ ర్యాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీచేశారు. అప్పుడే టీవీ ప్రకటన నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులను చూపించిన క్లిప్‌ను తొలగించింది.
దీన్ని ఎవరూ సహించరు: సజ్జనార్
ఆ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘‘యూట్యూబ్ యాడ్స్‌లో తరచూ వస్తున్న ర్యాపిడో ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని ఒక ప్రముఖ నటుడు ప్రజలకు చెప్పడం ఉంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వచ్చాయి. ర్యాపిడో ప్రాముఖ్యతను చాటేందుకు ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడం తగదు. దీన్ని అందరూ ఖండిస్తున్నారు.
టీఎస్‌ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్‌ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’’ అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Also Read: Sand Theft Detection: వారెవ్వా.. ఇసుక మాఫియాను అరికట్టే పరికరం కనిపెట్టిన విద్యార్థిని
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..