సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంపన్న మహిళలే లక్ష్యంగా వారి నుంచి రూ.కోట్లు దోచుకొన్న కేసులో అరెస్టయిన శిల్పా చౌదరి విచారణ కొనసాగుతోంది. ఆమె కాజేసిన సొమ్మును రికవరీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా సమాచారం. ఈమె బాధితుల జాబితాలో కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఐపీఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఖరీదైన కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ అధిక వడ్డీ ఎర వేసి విపరీతంగా శిల్పా చౌదరి అప్పులు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు రెండ్రోజుల కస్టడీకి తీసుకునన పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టారు.
ఈ క్రమంలో ఇతరుల నుంచి సేకరించిన డబ్బు ఏం చేశారని ప్రశ్నించగా.. తన నుంచి రాధిక అనే మహిళ డబ్బులు తీసుకున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఆమెకు డబ్బు ఇచ్చానని, తిరిగి ఇవ్వలేదని తెలిపినట్లుగా సమాచారం. అంతేకాక, సెహరి చిత్ర నిర్మాణంలోనూ తాను 12 శాతం పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అనంతరం గండిపేటలోని శిల్పా చౌదరి విల్లాకు ఆమెను తీసుకెళ్లి పోలీసులు సోదాలు చేయగా.. కీలక దస్త్రాలు దొరికాయి.
డబ్బులు తిరిగిచ్చేస్తా!
తనకు మోసం చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని శిల్ప విలపించినట్లు తెలిసింది. తాను డబ్బు తీసుకున్న అందరి నుంచి తనకు డబ్బులిచ్చిన వారిలో చాలామంది బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నం చేశారని తొలిరోజు పోలీసు కస్టడీ సందర్భంగా శిల్ప స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు కస్టడీలో శిల్పా చౌదరి పెద్దగా వివరాలేమీ చెప్పలేదని తెలిసింది.
జెంటిల్‌మెన్ స్టోరీ!
ఇంకో సందర్భంలో ఆమె 1993లో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమా స్టోరీని చెప్పినట్లుగా తెలిసింది. ఓ ఆస్పత్రి నిర్మాణం కోసం కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆమె పోలీసులకు చెప్పిందని సమాచారం. తమ ఇంట్లో చాలా ఆధారాలున్నాయని శిల్ప చెప్పినట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బులపైనా పోలీసులు ఎలాంటి సమాధానాలను రాబట్టుకోలేదని సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియడంతో శిల్పాచౌదరిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, రాధికారెడ్డి అనే పేరును శిల్ప వెల్లడించలేదని పోలీసులు చెబుతుండగా శనివారం రాత్రి రాధికారెడ్డి అనే పేరున్న మహిళ ఒకరు మాదాపూర్ డీసీపీని కలిశారు. శిల్పతో ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీడియాలో చక్కర్లు కొడుతోందని ఫిర్యాదు చేశారని సమాచారం. మీడియాను నియంత్రించాలని ఆమె కోరినట్లు తెలిసింది.
Also Read: Sand Theft Detection: వారెవ్వా.. ఇసుక మాఫియాను అరికట్టే పరికరం కనిపెట్టిన విద్యార్థిని
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..