Rajiv Swagruha Flats For Sale: హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న వారి కోసం హెచ్‌ఎండీఏ రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ, పోచారం పరిధిలోని రాజీవ్ స్వగృహ (Rajiv Swagruha) ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేటి నుంచి లాటరీ పద్దతిలో రాజీవ్ స్వగృహ ప్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు.


లాటరీ ద్వారా విజేతల పేర్లు ప్రకటన 
పోచారంలో 1,470 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. పోచారంలోని ప్లాట్ల కోసం  5,921 దరఖాస్తులు వచ్చాయి. నేడు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లకు లాటరీ తీసి విజేతలను ప్రకటిస్తారు. గతంలో నిర్ణయించిన ధరల ప్రకారం ఇల్లులు ఆ విజేతల జాబితాలోని వారు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ల విక్రయాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 27న పోచారం, బండ్లగూడలోని జూన్ 28న, బండ్లగూడలోని త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ప్లాట్ల కోసం జూన్ 29న లాటరీ తీస్తున్నారు. ఎలాంటి అవినీతి లేదని తెలిపేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు లాటరీ ప్రక్రియను రికార్డ్ చేస్తామని తెలిపారు.


పోచారం ప్లాట్ల నుంచి ప్రక్రియ ప్రారంభం..
పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు రాగా, బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం నుంచి జూన్‌ 14 వరకు www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. నేడు పోచారంలోని ప్లాట్లకు లాటరీ తీస్తున్నారు. ఒకవేళ లాటరీలో పేరు రాకపోతే ఫీజును వెనక్కి తిరిగి ఇవ్వరు. లాటరీలో ఎంపికైన వారికి బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఇవ్వనున్నారు.


అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 1,082 ఫ్లాట్లలో పనులు కొనసాగుతున్నాయి. ఈ బండ్లగూడ ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.3 వేలు, సగం పనులు పూర్తయిన ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.2,750గా హెచ్ఎండీఏ నిర్ణయించింది.


ఇక 3 BHK డీలక్స్ ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్రూమ్స్, 3 అటాచ్డ్ బాత్ రూమ్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలు ఉంటాయి. 3 BHK ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్ రూం, 2 అటాచ్డ్ బాత్ రూమ్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ ఉంటాయి. 2 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, బాల్కనీ, 1 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, బాల్కనీ ఉన్నాయి.