తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ ఏకంగా 24 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. మొత్తం ఈ సంస్థ రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అత్యాధునిక అమోలెడ్ స్క్రీన్‌లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన అరుదైన ఈ ఫీట్ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని కేటీఆర్ తెలిపారు.
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో స్థాపించనుందని కేటీఆర్ తెలిపారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్ తెలంగాణలోనే తయారవుతుందని అన్నారు. తెలంగాణకు ఈ రోజు చారిత్రాకమైన రోజని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్‌తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై బెంగళూరులో సంతకాలు చేశారు.
వేలాది మందికి ఉపాధి
ఈ డిస్‌ప్లే ఫ్యాబ్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3 వేల మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాజే ఎక్స్‌పోర్ట్స్ ఛైర్మన్ రాజేశ్ మెహతా తెలిపారు. దీంతో పాటు డిస్‌ప్లే ఫ్యాబ్ పార్టనర్స్, ఈ రంగ అనుబంధ సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. తమ ఎలెస్ట్ కంపెనీ 6వ జనరేషన్ ఆమోల్డ్ డిస్‌ప్లే తయారీ ద్వారా భారత దేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమని అన్నారు.