తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (జూన్ 13) నుంచి స్కూళ్లు రీఓపెన్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. వేసవి సెలవులను పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. స్కూళ్ల పున:ప్రారంభం కోసం పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


స్కూళ్లకు 65 లక్షల మంది పిల్లలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పిల్లలు స్కూ్ళ్లకు వెళ్లనున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లలకు వారి సమీప పాఠశాలల్లో స్వాగతం పలకాలని మంత్రి సబిత సూచించారు. రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, అయినా ఇబ్బందులు లేకుండా సాధారణ రీతిలో బోధన కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులకు యథాతథంగా బుక్స్, స్కూలు యూనిఫాంలు అందిస్తామని తెలిపారు. టెట్‌ పరీక్ష నిర్వహణ బాగా జరిగిందని స్పష్టం చేశారు. దాదాపు 1.64కోట్ల బుక్స్‌ను పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.


‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 9 వేల ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధన ఉంటుందని మంత్రి వివరించారు. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం తరగతులతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, ఆ సమస్య రాకుండా విధానం రూపొందించినట్లు చెప్పారు. అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని వివరించారు. ఇంగ్లిషు మీడియం నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై శ్రద్ధ పెట్టాలని కోరారు.


బండి సంజయ్‌కు సబిత సవాల్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సబిత కౌంటర్ వేశారు. ‘మన ఊరు – మన బడి’కి కేంద్రం రూ.2700 కోట్లు నిధులు ఇచ్చిందని బీజేపీ నేత చెబుతున్నారని, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక పక్క టెట్‌ వాయిదా వేయాలంటూనే, మరోవైపు 20 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలంటున్నారని అన్నారు. బండి సంజయ్‌ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఉపాధ్యాయులు మానసిక క్షోభకు గురవుతున్నారనేది కూడా అబద్ధమని అన్నారు. వారికి దేశంలో ఎక్కడా లేనివిధంగా జీతాలు పెంచామని చెప్పారు.