Fashion Designer Pathyusha Suicide: హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయే ముందు ప్రత్యూష రాసిన సూసైడ్ లెటర్‌ను బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదు అని,  అందుకే వెళ్లిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చారు ప్రత్యూష. గత కొంత కాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రత్యూష.. ఈ జీవితాన్ని కొనసాగించడం ఇష్టం లేక బలవన్మరణం చెందినట్లు పోలీసులు గుర్తించారు. సూసైడ్ లెటర్, పెన్ డ్రైవ్, మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


డిప్రెషన్ నుంచి బయటకు రాలేక కఠిన నిర్ణయం..
39 ఏళ్ల ప్రత్యూష గరిమెళ్ల ఒంటరిగా జీవిస్తున్నారు. డిప్రెషన్ నుండి బయటకు రాలేక ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష తీవ్ర మనస్థాపం చెందింది. నిప్పులపై రసాయనాన్ని వేసి పొగ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యూష ఇంట్లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ ఫోన్‌లో ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఎందుకు చనిపోతుందో, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది లాంటి విషయాలను సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసినట్లు సమాచారం. ఆ సెల్ఫీ వీడియోలో తన పరిస్థితి మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం పూర్తి 
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినీ తారలకు ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసి గుర్తింపు సాధించారు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ప్రత్యూష ఒకరు. చనిపోయే ముందు ప్రత్యూష చివరిగా ఓ ప్రముఖ హీరోయిన్ తో  మాట్లాడినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రత్యూష మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్గం నిర్వహించారు. అనంతరం అపోలో ఆస్పత్రికి మృతదేహం తరలించారు. ఈరోజే ప్రత్యుష అంత్య క్రియలు నిర్వహించనున్నారని సమాచారం. 


రెండు రోజులుగా ఇంట్లోనే.. అంతలోనే విషాదం  
గత రెండు రోజులుగా ప్రత్యూష ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో రెసిడెన్సీ వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో వాచ్ మన్ తలుపులు కొట్టాడు. తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు శనివారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ప్రత్యూష మృతదేహం బాత్రూంలో పడి ఉండడాన్ని గమనించారు. ఆమె మృతదేహం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పడి ఉంది. ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Srikanthachari Father Missing: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి అదృశ్యం, కేఏ పాల్ పై శంకరమ్మ సంచలన ఆరోపణలు


Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!