Srikantha Chari mother sensational comments on KA Paul: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా తన భర్త వెంకటాచారి కనిపించడం లేదంటూ ఆయన భార్య కాసోజు శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆయన అదృశ్యమైన పది రోజుల తరువాత శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 1వ తేదీన ఓ పని మీద వెంకటాచారి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని, ఆయనను చూడలేదని.. తన భర్త జాడ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదులో శంక‌రమ్మ‌ పేర్కొన్నారు. శ్రీకాంతచారి (ఆగష్టు 15, 1986 - డిసెంబర్ 3, 2009) మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు.


కేఏ పాల్‌పై శ్రీకాంతచారి తల్లి ఆరోపణలు.. 
తన భర్త వెంకటాచారి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించడం తెలిసిందే. కేఏ పాల్ ఆహ్వానం మేరకు వెంకటాచారి ప్రజా శాంతి పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత్ ఆచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న భారీ సభ నిర్వహిస్తామని కేఎల్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ అసలైన ఆవిర్భావ దినోత్సవం అదేరోజు అంటూ రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపారు కేఏ పాల్. కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తి కేఏ పాల్ అని శంకరమ్మ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్బీనగర్ జంక్షన్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కేఏ పాల్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి కేఏ పాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన కొన్ని రోజులకే తన భర్త వెంకటాచారి కనిపించడం లేదని శంకరమ్మ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.


ప్రజా శాంతి పార్టీలో చేరిక.. అంతలోనే మిస్సింగ్ !
శ్రీకాంతచారి తల్లిదండ్రులు శంకరమ్మ, వెంకటాచారి హయత్‌నగర్‌ పరిధిలోని సూర్యనగర్‌ కాలనీ రోడ్డు నంబర్‌-8లో నివాసం ఉంటున్నారు. జూన్ 1న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటాచారి, జూన్ 2న ఆయన సోషల్ మీడియాలో కనిపించారని.. తన భర్త ఇప్పటివరకూ ఇంటికి తిరిగి రాలేదంటూ హయత్ నగర్ పోలీసులను శంకరమ్మ ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరిస్తోందని ఆరోపణలు చేసిన వెంకటాచారి ఇటీవల ప్రజా శాంతి పార్టీలో చేరారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు కేఏ పాల్ ముందుకు వచ్చారని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి తన భర్త కనిపించడం లేదని, ఆయన జాడ కనిపెట్టాలని శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.


కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు
తనను సైతం కేఏ పాల్ కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేశారని అయిదారు రోజుల కిందట శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఆరోపణలు చేశారు. రూ.20 లక్షలు ప్యాకేజీ ఇచ్చి తనను కిడ్నాప్ చేయాలని నాలుగైదు మందిని పంపించారని చెప్పారు. మరోవైపు తన భర్త ఆరోగ్యం బాగోలేదని, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయనకు ఏమైనా జరిగితే కేఏ పాల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన భర్త వెంకటాచారికి వేరే వాళ్ల నుంచి ప్రాణ హాని ఉందని కేఏ పాల్ చెబుతున్నారని, ఇదే అదనుగా చేసుకుని ఆయనను ఏమైనా చేసి వేరే వాళ్ల మీద ప్రయత్నాలు సైతం జరిగే అవకాశం ఉందని శంకరమ్మ కొన్ని రోజుల కిందట సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా భర్త మిస్సింగ్ అని హయత్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Also Read: Pathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య!


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల ప్రజలను ఠారెత్తిస్తోన్న ఎండలు - రుతుపవనాల వర్షాలు మొదలయ్యేవరకు బీ కేర్‌ఫుల్!