Pathyusha Garimella : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. ప్రత్యూష కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభించింది. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ ప్రముఖులకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు. స్టీమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ కలుపుకుని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు రోజులుగా ఇంట్లోనే
గత రెండు రోజులుగా ప్రత్యూష ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో రెసిడెన్సీ వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో వాచ్ మన్ తలుపులు కొట్టాడు. తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు శనివారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ప్రత్యూష మృతదేహం బాత్రూంలో పడి ఉండడాన్ని గమనించారు. ఆమె మృతదేహం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పడి ఉంది. ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రత్యూష హైదరాబాద్ లో స్థిరపడ్డారు. పదేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం ఆమె పనిచేస్తుంది. ప్రత్యూష సూసైడ్ లెటర్ రాసిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె మొబైల్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. 39 ఏళ్ల ప్రత్యూష గరిమెళ్ల ఒంటరిగా జీవిస్తున్నారు. ప్రత్యూష తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.