సముద్ర గర్భంలో కోట్ల విలువైన బంగారు నాణేలు 
ఎన్నో అంతు పట్టని రహస్యాలకు కేంద్రం..సముద్రం. లోతుల్లోకి వెళ్లేకొద్దీ వింతలు, విశేషాలెన్నో బయపడుతుంటాయి. ఇప్పటికే ఇలాంటివెన్నో వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు ఇలాంటి వార్తే ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యంలో ముంచింది. కొలంబియాలో సముద్రగర్భంలో 17 బిలియన్ డాలర్ల విలువైన బంగారు నాణేలు కనిపించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. దాదాపు మూడు శతాబ్దాల క్రితం ఈ నౌక మునిగిపోయిందని, శిథిలాల కింద ఈ బంగారు నాణేలు కనిపించాయని అధికారులు తెలిపారు. 1708 వ సంవత్సరంలో సాన్‌జోస్  గాలియోన్ అనే నౌక బ్రిటీష్ నేవీ దాడి చేయటం వల్ల మునిగిపోయింది. కొలంబియాలోని కరేబియన్ పోర్ట్ వద్ద ఇది నీట మునిగినట్టు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో షిప్‌లో 600 మంది సిబ్బంది ఉండగా వారిలో 11 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2015లోనే ఈ నౌకను కనుగొన్నారు. 



ఆల్చిప్పల్లో బంగారు నాణేలున్నాయట
దాదాపు 3,100 అడుగుల లోతులో ఈ నౌక కూరుకుపోయినట్టు కరేబియన్ అధ్యక్షుడు ఇవన్ డ్యూక్ ప్రకటించారు. అయితే అంత లోతుల్లోకి మనిషి వెళ్లే పరిస్థితులు లేనందున ప్రత్యేక  వాహనాన్ని సముద్ర గర్భంలోకి పంపారు. రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ లోపలి దృశ్యాలను రికార్డ్ చేశారు. ఆ సమయంలోనే విలువైన బంగారు నాణేలున్నట్టు గుర్తించారు. ఆల్చిప్పల్లో బంగారు నాణేలుండటాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. బంగారు ఆభరణాలతో పాటు రత్నాలూ కనిపించాయి. ఆ కాలం నాటి వంట పాత్రల్నీ, గాజు సీసాలను ఇక్కడే గుర్తించారు. వీటిపై ఉన్న శాసనాల ఆధారంగా ఏ కాలం నాటివి అని తేల్చే పనిలో ఉన్నారు పరిశోధకులు. కొలంబియా నౌకాదళం ఎంతో  శ్రమించి ఈ నిధిని కనుగొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడు డ్యూక్. నిజానికి ఇంత లోతైన ప్రాంతంలో నిధిని కనిపెట్టటం అంత సులువైన విషయం కాదు. కానీ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది నౌకాదళం. ఇలాంటి నిధులను గుర్తించి భద్రపరిచేందుకు ఇలాంటి సాంకేతికత ఎంతో ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో విశేషం ఏంటంటే ఈ నౌకకు దగ్గర్లోనే మరో రెండు నౌకలు ఇలాగే మునిగిపోయినట్టు గుర్తించారు. స్పెయిన్‌కు చెందిన లాడెన్ నౌకను ప్రస్తుతానికి కొలంబియా నౌకాదళం పరిశోధిస్తోంది. వీటితో పాటు ఇలా సముద్ర గర్భంలో కలిసిపోయిన నౌకల్ని వెలికి తీసి చరిత్రను రక్షించేందుకు కృషి జరుగుతోంది. అయితే లాడెన్ నౌక విషయమై స్వీడన్, కొలంబియా మధ్య వివాదం నడుస్తోంది. ఆ నౌక తమకే చెందుతుందని స్పెయిన్ అంటుండగా..తమ జలాల్లో మునిగిపోయినందున తామే సంరక్షిస్తామని కొలంబియా చెబుతోంది.