IPL Media Rights Tender live: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి! బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇప్పటికే అమెజాన్, గూగుల్ సాంకేతిక బిడ్లు సమర్పించలేదు. ఇప్పుడు జీ సైతం ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. దాంతో డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
మరికొన్ని రోజుల్లో సోనీ నెట్‌వర్క్‌లో జీ విలీనం కాబోతోంది. అలాంటప్పుడు వారికి పోటీలో నిలవడంలో అర్థం లేదని జీ భావిస్తున్నట్టు తెలిసింది. దాంతో ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. 'జీ ఎందుకు బిడ్ వేస్తుంది? వారి భాగస్వామి సోనీతో పోటీకి వస్తారా? తర్వలోనే ఈ రెండు సంస్థలు విలీనం అవుతున్నాయి. అందుకే రేసులో ఉండటం లేదు' అని జీ ప్రమోటర్ల సన్నిహిత వర్గాలు చెప్పినట్టు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ రిపోర్టు చేసింది.
మీడియా హక్కుల వేలానికి వచ్చిన బిడ్లను బీసీసీఐ న్యాయ, ఆర్థిక కమిటీలు శుక్రవారం మూల్యాంకనం చేశాయి. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలు ఆదివారం బిడ్డింగ్ రౌండ్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు డిస్నీ స్టార్, రిలయన్స్, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ అర్హత సాధించాయని తెలిసింది. టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో డిజిటల్ హక్కుల్లో పాల్గొంటున్నాయి. సూపర్ స్పోర్ట్ ప్యాకేజ్ డీ బరిలో ఉంది. పోటీదారులు తక్కువమందే ఉన్నారు కాబట్టి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హక్కులు దక్కించుకుంటారని అనిపిస్తోంది.
చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్ బిడ్డింగ్ వేసింది. అయితే ఈ సారి బీసీసీఐ కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్ సబ్‌కాంటినెట్ డిజిటల్ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్ నాన్ ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్, 4 ప్లేఆఫ్ మ్యాచులు, 13 ఈవినింగ్ డబుల్ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.
Also Read: ఐపీఎల్ ఒక మ్యాచ్ విలువ రూ.100 కోట్లు! EPL రికార్డు బద్దలే ఇక!