IPL Media Rights Tender: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త రికార్డును సృష్టించబోతోంది! ఒక్కో మ్యాచ్‌ విలువ రూ.100 కోట్లను దాటబోతోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా ప్రాపర్టీగా ఐపీఎల్‌ (IPL) అవతరించనుంది. ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌, మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ను అధిగమించనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మీడియా హక్కుల వేలంపై ఆసక్తి పెరిగింది.


ప్రస్తుతం ఐపీఎల్‌ మీడియా హక్కులు (IPL Media Rights) స్టార్‌ ఇండియా వద్ద ఉన్నాయి. 2018-22 మధ్య కాలానికి రూ.16,348 కోట్లతో హక్కులను దక్కించుకుంది. గడువు ముగియడంతో 2022-27 మధ్య కాలానికి బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. కనీస ధర రూ.32,890 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఒక్కో మ్యాచుకు టీవీ ప్రసారానికి రూ.49 కోట్లు, డిజిటల్‌ అయితే రూ.33 కోట్లు వస్తాయి.


'ఐపీఎల్లో ఒక మ్యాచుకు టీవీ ప్రాసారాల ధర 20-25 శాతానికి మించకపోవచ్చు. డిజిటల్‌ మీడియా హక్కుల ప్యాకేజీకి మాత్రం విపరీతంగా పెరగనుంది. మొత్తం కలిపితే ఒక్కో మ్యాచ్‌ ధర రూ.115-120 కోట్లకు పెరుగుతుంది' అని స్పోర్ట్స్‌ సొల్యూషన్స్‌ స్పోర్ట్స్‌ మీడియా హక్కుల సీఈవో ఆశిష్‌ చందా అంటున్నారు.


ప్రస్తుతం అమెరికా నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (NFL) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా ప్రాపర్టీ. ఈ లీగులో ఒక్కో మ్యాచ్‌ ప్రసార విలువ రూ.134 కోట్ల వరకు ఉంటుంది. రూ.81 కోట్లతో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌  (EPL) రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రూ.54 కోట్లతో ఉన్న ఐపీఎల్‌ మ్యాచ్‌ విలువ సులభంగా దానిని దాటేస్తుందని అంచనా. దాంతో మన క్రికెట్‌ లీగ్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఈవెంట్‌గా రికార్డు సృష్టిస్తుంది.


'క్రీడా పరిశ్రమలో ఐపీఎల్‌ మీడియా హక్కులు సరికొత్త రికార్డు సృష్టిస్తాయని మేం నమ్మకంగా ఉన్నాం. ఒక కచ్చితమైన సంఖ్యను మేం అంచనా వేయడం లేదు. మొత్తానికి బీసీసీఐ మాత్రం రికార్డు బ్రేకింగ్‌ ధరపై విశ్వాసంతో ఉంది' అని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్‌ అంటున్నారు.


ఈ సారి ఉమ్మడి బిడ్‌ వేయకుండా హక్కులను విడదీసి బీసీసీఐ వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్‌ సబ్‌కాంటినెట్‌ డిజిటల్‌ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్‌ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్‌, 4 ప్లేఆఫ్‌ మ్యాచులు, 13 ఈవినింగ్‌ డబుల్‌ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, టీవీ 18 వయాకామ్‌, అమెజాన్‌, జీ, సోనీ హక్కుల పత్రాలను కొనుగోలు చేశాయని తెలిసింది. ఈ ఐదుగురు చాలా సీరియస్‌గా హక్కుల కోసం ట్రై చేస్తున్నాయి. వీరికి పోటీగా ఫేస్‌బుక్‌ (Face book), ఆపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌ వస్తున్నాయని తెలుస్తోంది.