IPL Ravi Shastri Says there could be 2 IPL season a year in future know details : అంతర్జాతీయ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు రావాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) అంటున్నాడు. ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ద్వైపాక్షిక సిరీసులను గణనీయంగా తగ్గించాలని సూచిస్తున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనళ్లను తప్ప మిగతా మ్యాచుల్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించాడు. కొన్నేళ్లుగా ఫ్రాంచైజీ క్రికెట్‌ మ్యాచుల పెంపుకోసం ఆయన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


'ఏడాదికి రెండు ఐపీఎల్‌ సీజన్లే భవిష్యత్తు! రేపు 140 మ్యాచులు అవుతాయి. రెండు సీజన్లకు 70-70గా విభజించొచ్చు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఫ్రాంచైజీ క్రికెట్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనిని మన నుంచి ఎవరూ దాచలేరు' అని రవిశాస్త్రి అన్నాడు.


ఆటగాళ్లపై ద్వైపాక్షిక సిరీసుల భారం తగ్గించాలని రవిశాస్త్రి చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాడు. 'టీ20 క్రికెట్లో చాలా ద్వైపాక్షిక సిరీసులు జరుగుతున్నాయి. టీమ్‌ఇండియాకు కోచ్‌గా ఉన్నప్పుడూ నేనిదే మాట చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. నా కళ్ల ముందరే ఫ్రాంచైజీ క్రికెట్‌ డెవలప్‌ అవ్వడం చూస్తున్నాను. క్రికెట్‌ కచ్చితంగా ఫుట్‌బాల్‌ బాట పట్టాల్సిందే. టీ20 క్రికెట్లో కేవలం ప్రపంచకప్‌ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక మ్యాచులను ఎవరూ గుర్తు పెట్టుకోరు' అని ఆయన పేర్కొన్నాడు.


'టీమ్‌ఇండియా కోచ్‌గా ఐసీసీ ప్రపంచకప్‌లు తప్పా నాకు ఇంకే మ్యాచులూ గుర్తు లేవు. మెగా టోర్నీని గెలిచిన జట్టే దానిని గుర్తుంచుకుంటాయి. దురదృష్టవశాత్తు మనం గెలవలేదు కాబట్టి మనం గుర్తుంచుకోం. నా ఉద్దేశంలో ప్రతి దేశం సంవత్సరం పొడవునా ఫ్రాంచైజీ క్రికెట్‌ నిర్వహించాలి. దేశవాళీ క్రికెట్‌ తరహాలోనే ఇది ఉండాలి. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ప్రపంచకప్‌ ఆడాలి' అని రవిశాస్త్రి వెల్లడించాడు.