బాధ్యత! మామూలు మనుషుల్ని రుషులుగా మారుస్తుంది. చిరుబుర్రులు ఆడేవారితో పరిణతి ప్రదర్శించేలా చేస్తుంది. ప్లేబాయ్ తరహా క్యారెక్టర్‌లో హీరోయిజం చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే..! అరెరే అతడిలో ఇంత టాలెంట్ ఉందా? ఇలా చేయగలడా? అద్భుతాలను సృష్టించగలడా? అని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది! ఇందుకు మంచి ఉదాహరణ హార్దిక్ పాండ్య (Hardik Pandya)!
ఐపీఎల్ 2022 ఆరంభం ముందు వరకు హార్దిక్ అంటే మనకు తెలిసింది ఒక ఆల్‌రౌండర్‌గా మాత్రమే! గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక అతడిలో ఒక నాయకుడు కనిపించాడు. సహచరులకు అండగా నిలిచే ఒక స్నేహితుడు దర్శనమిచ్చాడు. విమర్శలను తరిమికొట్టే విప్లవకారుడు అగుపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఒత్తిడిని పోగొట్టే స్ట్రెస్‌బస్టర్ కనిపించాడు. ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమలు చేసే యోధుడు కళ్లముందు కదిలాడు. మొత్తంగా ఆటుపోట్లను ఎదుర్కొని గెలుపు బాట పట్టే 'విజేత' కనిపించాడు.
ఒకప్పడు హార్దిక్ పాండ్య అంటే టీమ్‌ఇండియా 'ప్లే బాయ్'! ఐపీఎల్ 2022 'ఏ లీడర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్'గా అతడిని పరిచయం చేసింది. 360 డిగ్రీల్లో అతడిలోని ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూపించింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఇంటికి తీసుకొచ్చే 'మ్యాన్ ఇన్ బ్లూ'గా అంచనాలు పెంచేసింది. ఐపీఎల్ 15లో అతిపెద్ద ఫైండింగ్ 150 కి.మీ వేగంతో బంతులేసే కుర్రాళ్లో, మెరుపు ఇన్నింగ్సులు బాదేసే యువకులో కాదు. భవిష్యత్తులో భారత జట్టును నడిపించే నాయకుడిని కనుగొనడం!!
హార్దిక్ పాండ్య ఎంత మంచి ఆల్‌రౌండరో అందరికీ తెలుసు. జట్టులో దూసుకుపోతున్న అతడికి 'కాఫీ విత్ కరణ్ షో' బ్రేకులు వేసింది. అనవసర విమర్శలు తెచ్చిపెట్టి నిషేధానికి గురి చేసింది. దాంతో ఎక్కడ ఎలా మాట్లాడాలో అతడు తెలుసుకున్నాడు. కీలక సభ్యుడిగా మారిన తరుణంలో వెన్నెముక గాయం ఇబ్బంది పెట్టింది. ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఏడాది పాటు క్రికెట్‌కు దూరం చేసింది. పుంజుకొని మళ్లీ వచ్చినా బౌలింగ్ ఫిట్‌నెస్ లేకపోవడం జట్టులో చోటును దూరం చేసింది. క్రమంగా టెస్టు, వన్డే, టీ20ల్లో చోటు కోల్పోయాడు. ఇంతలోనే పెళ్లిచేసుకున్నాడు. ఓ కొడుకును కన్నాడు. అతడిలో క్రమంగా మార్పు మొదలైంది.
ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు పాండ్య బ్రదర్స్ రెండు కళ్లలాంటివారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారిద్దరినీ దూరం చేసుకుంది. ఇదే హార్దిక్ తలరాతను మార్చేసింది. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ అతడిని తీసుకుంది. పైగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి సాహసమే చేసింది. దేశవాళీ క్రికెట్లో అతడికి నాయకత్వం వహించిన అనుభవమే లేదు. ఇక జట్టు కూర్పే సరిగ్గా కుదరలేదు. ఓపెనర్ జేసన్ రాయ్ సీజన్ మొదలవ్వకముందే వెళ్లిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫామ్‌లో లేని పాత సరుకు! ఇలాంటి జట్టుతో అతడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.
కొన్నిసార్లు ఆదుకుంటారని భావించినవాళ్లే చేతులొదిలేస్తారు. అప్పుడు అంచనాల్లేని వారే ఆదుకుంటారు. టైటాన్స్‌లో ఇదే జరిగింది. రాయ్ లేకున్నా వృద్ధిమాన్ సాహా ఓపెనింగ్‌లో దంచేశాడు. శుభ్‌మన్ అతడికి ఎలాగూ తోడుగా ఉన్నాడు. మూడో స్థానాన్ని పక్కన పెడితే తెవాతియా, మిల్లర్, రషీద్ ఫినిషర్లుగా మురిపించాడు. కానీ టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ హార్దిక్ పాండ్య అండగా నిలిచాడు. జట్టును ముందుండి నడిపించాడు. మునుపట్లా బాదుడే బాదుడు కాకుండా చక్కని బంతుల్ని గౌరవించాడు. చెత్త బంతుల్నే బౌండరీకి కొట్టాడు. అవసరమైనప్పుడు సింగిల్స్ తీశాడు. నిలదొక్కుకోగానే దంచికొట్టాడు. ఇక బంతితోనూ ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ శైలిని కాస్త మార్చుకొని ఫర్‌ఫెక్ట్ లెంగ్తుల్లో బంతులు విసిరాడు. వికెట్లు తీశాడు. ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టాడు. ఫైనల్ మ్యాచులో బౌలింగే ఇందుకు ఉదాహరణ.
ఫైనల్ మ్యాచులో సాయికిషోర్‌ను అటాక్ చేయకుండా రక్షించి ప్రత్యర్థి వ్యూహాలను నిర్వీర్యం చేశాడు. షమి, లాకీ, రషీద్‌తో పాటు తానే బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆఖర్లో సాయికిషోర్ బౌలింగ్‌లో రాజస్థాన్ రన్స్ కొట్టలేకపోయింది. అవసరమైనంత టార్గెట్ ఇవ్వలేకపోయింది. ఇక ఛేజింగ్‌లోనూ కఠినమైన వికెట్‌పై ఈజీగా బ్యాటింగ్ చేశాడు. ఔటైనప్పుడు, వికెట్లు తీయనప్పుడు, బౌలర్లు రాణించనప్పుడు కాస్త యానిమేటెడ్‌గా కనిపించినా డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం స్ట్రెస్‌బస్టర్‌గా మారి అందరికీ దగ్గరయ్యాడు. ఒక నాయకుడిగా ఎదిగాడు. అందుకే హార్దిక్ పాండ్య 360 డిగ్రీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు టీమ్‌ఇండియాకు భవిష్యత్తుగా కనిపిస్తోంది.