Hardik Pandya on comeback road: Woke up at 5 am every day, no one knows the sacrifices I made : అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనన్ని రోజులు తానేం చేశానో ఎవరికీ తెలియదని టీమ్‌ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. ఫిట్‌నెస్‌ అందుకొనేందుకు, ఆటను మెరుగు పర్చుకొనేందుకు చాలా త్యాగాలు చేశానని పేర్కొన్నాడు. ఇష్టమైనవి వదిలేసుకున్నానని వెల్లడించాడు. అతడు మాట్లాడిన వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.


'నేను పునరాగమనం చేసేంత వరకు నాపై చాలా వదంతులు వచ్చాయి. వాటికి జవాబులు ఇవ్వడం నాకిష్టం లేదు. నేను అనుసరించిన ప్రాసెస్‌ పట్ల గర్వంగా ఉన్నాను. ఈ ఆరు నెలలు  నేనేం చేశానో ఎవరికీ తెలియదు' అని హార్దిక్‌ అన్నాడు.


'నేను ఉదయం 5 గంటలకే నిద్రలేచి ప్రాక్టీస్‌ చేసేవాడిని మళ్లీ సాయంత్రం 4 గంటలకు మరోసారి సాధన చేసేవాడిని. ఆ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకొనేందుకు ప్రయత్నించా. దాదాపుగా నాలుగు నెలలు రాత్రి 9.39 గంటలకే నిద్రపోయాను. చాలా త్యాగాలు చేశాను. కానీ ఇవన్నీ నాకోసమే. ఐపీఎల్‌ ముందు వరకు నేనిలాంటి యుద్ధమే చేశాను. ఆ కష్టానికి తగిన ఫలితాలు మాత్రం నన్ను సంతృప్తి పరిచాయి' అని పాండ్య పేర్కొన్నాడు.


'నేనెంత కష్టపడ్డానో నాకే తెలుసు. నా జీవితంలో ఫలితాల గురించి ఆలోచించకుండా నిరంతరం కష్టపడ్డాను. నిజాయతీగా పనిచేశాను. అందుకే నేనేదైనా ప్రత్యేకంగా చేస్తే ఆశ్చర్యం అనిపించదు. నా ప్రయాణంతో పాటే అవి వస్తుంటాయి' అని హార్దిక్‌ తెలిపాడు.


ఇకపై టీమ్‌ఇండియాకు ఆడే ప్రతి మ్యాచులో అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని పాండ్య చెప్పాడు. 'నేనికపై ఆడే ప్రతి మ్యాచ్‌, సిరీస్‌ ఆఖరిదిగా భావిస్తాను. ప్రపంచకప్‌ గెలవడమే నా అల్టిమేట్‌ గోల్‌. నేను లయ అందుకొనేందుకు ఈ వేదికే సరైంది. భవిష్యత్తులో వరుస సిరీసులు ఉన్నాయి కాబట్టి లయలో ఉండటం మంచిది. ఫ్రాంచైజీతో పోలిస్తే ఇక్కడ నా పాత్ర మారుతుంది. కెప్టెన్‌గా ఉండను. బ్యాటింగ్‌కు ముందే రాను. పాత హార్దిక్‌గా కనిపిస్తాను' అని వెల్లడించాడు.