PV Sindhu Visits Lal Darwaza: హైదరాబాద్ లో లాల్ ద​ర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బోనాల పండుగలో పాల్గొన్నారు. స్వయంగా బోనమెత్తి అమ్మకు నైవేద్యం పెట్టారు. అమ్మవారికి ఆమె బంగారు బోనం సమర్పించారు. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు గత ఏడాది మాత్రం టోర్నమెంట్‌ కారణంగా రాలేకపోయారు. ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం సింధును ఆలయ కమిటీ సత్కరించింది.


‘‘నాకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. కానీ గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయాను. ఈసారి అమ్మకు బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి తప్పకుండా ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవంలో పాల్గొంటానని షట్లర్ పీవీ సింధు వెల్లడించారు.


మరోవైపు, లాల్‌ దర్వాజా అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూలో వేచి చూస్తున్నారు. మైనంపల్లి కుటుంబ సభ్యులు కూడా లాల్ దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత  బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని, బోనాలను ప్రభుత్వం అధికార పండుగగా జరుపుతోందని అన్నారు. దేవాలయాలకు నిధులు ఇచ్చే ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందని, అనుకున్న దాని కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి కాబట్టి అమ్మవారు శాంతించేలా పూజలు చేయాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ మంచి ఏర్పాట్లు చేసిందని అన్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.