రెండోరోజు తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానమంత్రి రానున్న వేళ సికింద్రాబాద్ మొత్తం కట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయం మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. పన్నెండు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి పూజలు చేసే సందర్భంలో ఇద్దరిని మాత్రమే ఆలయంలోకి అనుమతించారు.
కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్నారు ప్రధానమంత్రి మోదీ. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డి లోని పటాన్ చెరు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
పటాన్ చెరులో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రధాని షెడ్యూల్ ఖరారు అయినప్పటి నుంచి బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడ దాదాపు పాతిక ఎకరాల్లో సభ కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థానపకు రెండోది రాజకీయ ప్రసంగానికి. సంగారెడ్డి మొత్తం మోదీ, అమిత్‌షా ఇతర బీజేపీ నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది.
మోదీ ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇవే.
సంగారెడ్డిలో 9000 కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 1298 కోట్లతో సంగారెడ్డి చౌరాస్తా నుంచి మదీనా గూడ వరకు ఏర్పాటు చేసిన ఆరు వరుసుల జాతీయ రహదారి ప్రారంభిస్తారు. 399 కోట్లతో మెదక్- ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవేను జాతికి అంకితం చేస్తారు. 3338 కోట్లతో నిర్మించిన పారాదీప్- హైదరాబాద్ గ్యాస్‌పైప్‌లైన్ ప్రారంభిస్తారు. తర్వాత నాలుగు వందల కోట్లతో చేపట్టే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. 1409 కోట్లతో నిర్మించిన కంది రామసామి పల్లె సెక్షన్4లో నాలుగు వరుసల నేషనల్ హైవే ప్రారంభిస్తారు. 323 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన మిర్యాలగూడకోదాడ హైవే విస్తరణ రోడ్డును కూడా జాతికి అంకితం చేస్తారు. 1165 కోట్లతో హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభిస్తారు. ఘట్‌కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలు ప్రారంభిస్తారు.