Lok Sabha Elections 2024: తెలంగాణ (Telangana)లో 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ (BJP)...కీలకమైన మహబూబ్ నగర్ (Mahaboobnagar) ఎంపీ సీటును పెండింగ్ లో పెట్టడానికి కారణాలు ఏంటి ? మాజీ మంత్రి డీకే అరుణ (DK Aruna)కు సీటు గ్యారెంటీ అనుకుంటున్న తరుణంలో...ఆమె పేరు ఎందుకు ప్రకటించలేదు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు కోసం ఇద్దరు పోటీ పడటమే కారణమా ? లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. బీజేపీ తరపున ఎంపీ సీటును ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. జితేందర్ రెడ్డి ఒకసారి బీజేపీ తరపున, మరోసారి బీఆర్ఎస్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. అందుకే ఇపుడు ఆయన అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే డీకే అరుణ పేరు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో లేదని తెలుస్తోంది. 


జీర్ణించుకోలేకపోతున్న డీకే అనుచరులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చెరగని ముద్ర వేసింది డీకే అరుణ ఫ్యామిలీ.  గత లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపిలో చేరిన ఆమె...మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటితో ఓడిపోయారు. ఈ సారి  అదే నియోజవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న గద్వాల జేజమ్మ...మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ లో తన పవర్‌ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ హైకమాండ్‌తో ఆమెకున్న సంబంధాలు,  నమ్మకం,పార్టీలో ఉన్న ఇమేజ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న పట్టు ఉండటంతో తొలి జాబితాలోనే పేరు వస్తుందని లెక్కలు వేసుకున్నారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె...తొలి జాబితాలోనే టికెట్‌ కన్ఫామ్‌ అవుతుందని అనుకున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం 9 మంది అభ్యర్థిత్వాలను మాత్రమే ఖరారు చేసింది. ఈ పరిణామాన్ని డీకే అరుణనే కాదు...ఆమె అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. 


గత ఎన్నికల్లో ప్రత్యర్థికి ముచ్చెమటలు
ఫస్ట్‌ లిస్ట్‌లో డీకే అరుణ పేరు లేకపోవడానికి...ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పోటీ పడడమే కారణమని తెలుస్తోంది. డీకే అరుణకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు ప్రకటించాలంటే...ముందుగా అదే సీటును ఆశిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఒప్పించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. జితేందర్ రెడ్డికి ఏదో ఒకరకంగా నచ్చజెప్పి...గద్వాల జేజమ్మను బరిలో నిలబెట్టాలని కాషాయ పార్టీ నేలు వ్యూహాలు రచిస్తున్నారు. జితేందర్‌రెడ్డి కూడా తనకు టికెట్‌ కావాలని పట్టుపడుతున్నప్పటికీ...ఈ సారికి నో అని హైకమాండ్‌ భావనగా ఉన్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన డికే అరుణ...మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్  నుంచి పోటి చేసి గట్టి పోటి ఇచ్చారు. 3,33,573 ఓట్లు రాబట్టుకున్న ఆమె...అప్పటి అధికార బిఆర్ఎస్‌ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. 


అందుకే గద్వాల అసెంబ్లీ టికెట్ బీసీకి ఇప్పించారా ?
మరోసారి టికెట్ దక్కించుకొని విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఎంపీగా గెలిస్తే...కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ కోసం ప్రయత్నం చేయవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే డికే అరుణ తన సొంత నియోజక వర్గమైన గద్వాలలో...అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవకుండా బిసి అభ్యర్దికి టికెట్ ఇప్పించారని ప్రచారం జరుగుతోంది.