Sangareddy: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ.. సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటించారు. ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన మోదీ.. మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సోమవారం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు మోదీ చేరుకున్నారు. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని మహాకాళీ అమ్మవారిని మోదీ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాకాళీ అమ్మవారి దర్శనం పూర్తైన అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డికి మోదీ వెళ్లనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న మోదీ.. అనంతరం పటాన్ చెర్వులో జరిగే బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన క్రమంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.50 గంటల నుంచి 10.15 గంటల మధ్య రాజ్‌భవన్-బేగంపేట ఎయిర్‌పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్
10 గంటలకు మోదీ పటాన్ చెర్వు చేరుకోనున్నారు. 10.40కు పటేల్‌గూడలో జరిగే కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని పలు అభివృద్ది పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.1409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేను ప్రారంభించనుండగా, సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్లతో ఎన్‌హెచ్-65ను ఆరు లైన్లుగా విస్తరించే పనులకు, మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో నిర్మించనున్న ఎన్‌హెచ్ 765డి విస్తరణ, రూ.500 కోట్లతో చేపట్టనున్న ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం 11.20 గంటలకు పటేల్ గూడలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
సభాస్థలి వద్ద ఆంక్షలు
మోదీ పర్యటన వేళ ఇప్పటికే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మందితో మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. బహిరంగ సభ జరిగే ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఎలాంటి డ్రోన్లు ఎగరవేయడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సభకు హాజరయ్యేవారిని క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారు. సెల్ ఫోన్లను మాత్రమే లోపలికి అనుమిస్తామని, వేరే వస్తువులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పార్కింగ్ ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. అటు రెండు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ప్రకటన చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి షెడ్యూల్ కంటే ముందు ప్రకటించింది.