Praja Palana Application: తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇవాళ్టి(గురువారం) నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. డిసెంబర్‌ 31 జనవరి 1వ తేదీ మాత్రం ఈ కార్యక్రమానికి మినహాయింపు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 


ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజే రెండు గ్యారంటీలను అమలు చేశారు. మిగిలిన గ్యారంటీలతోపాటు మిగతా ప్రభుత్వం పథకాలు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఒకటే దరఖాస్తు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. 


రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం పొందని వారే అప్లై చేసుకోవాలని... ఇప్పటికే పథకాలు వస్తున్న వాళ్లు దరఖాస్తు చేయాల్సిన పని లేదని సూచిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లను బుధవారం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 16వేలకుపైగా శిబిరాల్లో కార్యక్రమం నిర్వహించడానికి దాదాపు నాలుగు వేల బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బుధవారం ప్రజాపాలనపై సీఎస్‌ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రామాల్లో ప్రజాపాలన సదస్సు ప్రారంభమవుతుందన్నారు. 


ఈ వివరాలు పూర్తి చేయాలి..
ప్రజాపాలన దరఖాస్తులను విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు అధికారుల వద్ద ఉంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామాల్లో పంచుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దరఖాస్తులో కుటుంబ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, యజమాని పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నింపాలి. 


ఏయే పథకాలు కావాలి..?
మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను ఆ దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేస్తుంటే.. ఆ పథకం పేరు కింద వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ఆ పథకం పేరు ఎదురుగా ఉన్న చెక్ బాక్స్‌లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. గ్యాస్ సబ్సిడీ కావాలనుకునేవారు.. ఆ పథకం పేరు ముందు టిక్ మార్క్ పెట్టి గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజెన్సీ పేరు, ఇప్పటి వరకు ఏడాదికి ఉపయోగిస్తున్న సగటు సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. 


రైతు బంధు కోసం దరఖాస్తు చేస్తే.. కౌలు రైతు, లేదా యజమాని అనే కాలమ్‌లలో టిక్ చేయాల్సి ఉంటుంది. రైతు కూలీలు తమ జాబ్ కార్డ్ నెంబర్ అక్కడ నమోదు చేయాలి. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు ఆ పథకం పేరు ముందు టిక్ మార్క్ ఉంచాలి. గృహజ్యోతి పథకం కింద విద్యుత్ రాయితీ పొందాలనుకునేవారు విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్‌ దరఖాస్తులో నమోదు చేయాలి. 


వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు.. వారికి కేటాయించిన చెక్ బాక్స్‌లను నింపాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబానికి చెందిన వారు కూడా ఇందులో వివరాలు నమోదు చేయాలి. అమరవీరుడు పేరు, చనిపోయిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్ నెంబర్, మరణ ధ్రువీకరణ పత్రం నెంబర్ నింపాలి. ఉద్యమకారుల విషయంలో సంబంధిత ఎఫ్‌ఐఆర్ నెంబర్, జైలుకు వెళ్లిన వివరాలు నింపాల్సి ఉంటుంది. 


జతచేయాల్సిన డాక్యుమెంట్లు..
దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ జతచేయాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన దరఖాస్తులను గ్రామసభల్లో అధికారులకు ఇచ్చి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులన్నిటినీ స్క్రూటినీ చేసి ఎవరెవరు, ఏ పథకానికి అర్హులో తేలుస్తారు. ఆ లిస్ట్ ప్రకారం సహాయం అందిస్తారు.