Telangana News: తెలంగాణాలోని సిఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఫార్మావిలేజ్ వివాదంగా మారిన తీరు, జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే డిమాండ్‌లు, సమస్యల పరిష్కారం దిశగా పోరాడాల్సిన పరిస్థితుల నుంచి కేసులు, ఫిర్యాదులతో ఏకంగా ఢిల్లీ కి చేరిందీ వివాదం. జరిగిన దాడులు వివరిస్తూ, పోలీసులు చిత్రవధ చేశారని ఊళ్లో మగాళ్లు పారిపోతున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లగచర్ల మహిళలు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సహా బిఆర్‌ఎస్ నేతల ఆధ్వర్యంలో బాధితులు ఢిల్లీలో ఫిర్యాదు చేసిన రోజే జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను మరో వర్గం కలిసింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రం ఇచ్చింది. ఫార్మా విలేజ్ ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారని, కంపెనీ రావడం వల్ల యువతకు ఉద్యోగాలు రావడంతోపాటు, భూములకు పరిహారం, ఇళ్ల స్థలాలు అందుతాయని చెప్పారు. తామ జీవితాలు మారుతాయని ఎస్సీ కమిషన్ ముందు కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మద్దతు తెలిపారు.
ఇలా ఒకే రోజు జరిగిన రెండు పరిణామాలు చూస్తుంటే రాజకీయ పార్టీలు లగచర్ల పట్ల అవలంభిస్తున్న విధానం అర్థమవుతుంది. బాధిత రైతులకు న్యాయం చేయడం, డిమాండ్‌ల పరిష్కారం కంటే, విభజించు రెచ్చగొట్టు అన్న తీరు కనిపిస్తుంది. లగచర్లతోపాటు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసే నాలుగు గ్రామాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి స్వేచ్చగా తిరిగే పరిస్దితి లేదు. కలెక్టర్‌పై దాడి ఆరోపణల ఎదుర్కొంటున్న వారు గ్రామాలు వదిలి పరారీలో ఉన్నారు. దాడి తరువాత పోలీసుల అత్యుత్సాహంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలా తండావాసులు జీవితాలు రాజకీయ చదరంగంలో పావులుగా మారుతున్నాయి.
Also Read: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా నిరసనలు చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదు. కలెక్టర్ అని తెలియక కొందరు దురుసుగా ప్రవర్తించారు.ఈ ఘటనను అడ్డుపెట్టుకుని భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగా భూములు లాక్కొవాలని అధికార పార్టీ చూస్తోందని బిఆర్‌ఎస్ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కావాలి..మా జీవితాలు మారాలి అనేది అధికార కాంగ్రెస్‌కు మద్దతుదారుల తీరు.
ఇలా వీరి కుమ్ములాటలో భూములు కోల్పుతున్న రైతులకు పరిహారం చెల్లింపు విషయం ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆ దిశగా భరోసా కల్పించే ప్రయత్నం అధికార పార్టీ సైతం చెయ్యడంలేదు. ఎంతసేపూ కలెక్టర్‌పై దాడి చుట్టూ వివాదం నడుస్తోందే తప్ప ఫార్మా ఏర్పాటు దిశగా అడుగు పడటంలేదు. బాధితుల ఒప్పించే విధంగా పార్టీలకు అతీతంగా ఓ చిన్న ప్రయత్నం జరగడంలేదు. అటు బిఆర్‌ఎస్ ఇటు కాంగ్రెస్ రెండూ రెండే అనే తీరులో పొలిటికల్ మైలేజ్ కోసమే తాపత్రయం అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?