Telangana News: తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు చాలా ఉత్సాహంగా సాగాయి. ఎక్కడ ఎలాంటి గడబిడలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది వేడుక. ముఖ్యంగా హైదరాబాద్‌లో పండగ ప్రశాంతంగా జరిగిపోవడంపై అటు ప్రభుత్వం, ఇటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విగ్రహాలు విక్రయాల నుంచి నిమజ్జనం వరకు పక్కా ప్రణాళికలతో ఫెస్టివల్‌ను ఘనంగా చేపట్టారు. 


విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు నుంచి నిమజ్జనం వరకు అంతా ప్లాన్ ప్రకారం చేపట్టారు. ఎప్పుడు ఏ విగ్రహం ఏ చెరువు వద్దకు తరలించాలి... జనాలకు ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్‌ ఏంటని అన్ని ముందుగానే సిద్ధం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెద్దగా లేకుండానే ముందస్తు హెచ్చరికలతో పోలీసులు విజయవంతం అయ్యారు. 

హైదరాబాద్‌, భైంసా, ముథోల్‌, జడ్చర్ల, కరీంనగర్‌, తాండూర్‌, మక్తల్‌, నిర్మల్‌, నారాయణపేట్‌, ఉట్కూర్‌, మహబూబ్‌నగర్‌ ఇలా కీలకమైన ప్రాంతాల్లో మధ్యాహ్నానికే పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ లాంటి మహా గణపతి విగ్రహమే మధ్యాహ్నం రెండు గంటలకు గంగమ్మ ఒడికి చేర్చారంటే పోలీసులు ఎంత పకడ్బంధీగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. 

30 వేల మందితో...

ఇలా పక్కా ప్లాన్ ప్రకారం నిమజ్జనం చేపట్టేందుకు దాదాపు 30 వేల మందికిపైగా పోలీసులు రాత్రిపగలు శ్రమించారు. ఒక్క హైదరాబాద్‌లోనే పాతిక వేల మంది పని చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు మూడు లక్షల వరకు విగ్రహాలు నిమజ్జనం చేశారు. జిల్లాల్లో విగ్రహాలు దీనికి అదనం. ఇలా ఎన్ని విగ్రహాలు వచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి దుర్ఘటనలు లేకుండా హడావుడి లేకుండా ప్రశాంతంగా పని కానిచ్చేశారు. వీళ్లకు మిగతా విభాగాలా సిబ్బంది సహకరించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలను పరిశీలించారు. ఇలా ఓ సీఎం నిమజ్జనం రోజు ట్యాంక్‌బండ్‌కు రావడం ఇదే తొలిసారి. వచ్చిన ఆయన అక్కడ సిబ్బందితో మాట్లాడారు. ప్రజలతో ముచ్చటించారు. ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనంలో రాత్రి పగలు శ్రమిస్తున్న సిబ్బంది ఎలాంటి లోటులేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. వాళ్లకు టైంకు ఫుడ్, ఇతర సౌకర్యాలు అందివ్వాలన్నారు. 


లడ్డూలకు భారీ డిమాండ్

ఈసారి కూడా గణేషుడి లడ్డూల కోసం భక్తులు పోటీ పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సాగిన వేలంలో భారీ ధర పెట్టి లడ్డూలను సొంతం చేసుకున్నారు. ఫేమస్ అయిన బాలాపూర్ గణపతి లడ్డూను కొలన్‌ శంకర్‌రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల ఒక వెయ్యిరూపాయలకు పాడుకున్నారు. అయితే దీని కంటే ఎక్కువ రేట్‌కు అమ్ముడైన గణపతి లడ్డూ కూడా ఉంది. బండ్లగూడ జాగీర్‌లో కీర్తీ రిచ్‌మౌండ్‌ విల్లాస్‌లో జరిపిన వేలంలో గణేషుడి లడ్డూ కోటీ 87 లక్షలకు భక్తులు సొంత చేసుకున్నారు. ఇప్పటి వరకు గణేషుడి లడ్డూ ధరల్లో ఇదే ఆల్‌టైం రికార్డ్‌గా చెబుతున్నారు. ఈ రెండే కాకుండా ఈ సారి చాలా ప్రాంతాల్లో లడ్డూలు వేలం వేశారు. 

  వేలం జరిగిన ప్రాంతం    లడ్డూ ధర 
1 బండ్లగూడ జాగీర్‌లో కీర్తీ రిచ్‌మౌండ్‌ విల్లాస్‌   రూ. 1కోటీ 87లక్షలు
2 బాలాపూర్‌         రూ. 30.01 లక్షలు 
3 మాధాపూర్‌లోని మైహోమ్‌ భూజా    రూ. 29 లక్షలు 
4 కర్మన్‌ ఘాట్‌        రూ. 16 లక్షలు 
5 బడంగ్‌పేట        రూ. 11.90 లక్షలు 
  అత్తాపూర్‌        రూ. 11.16 లక్షలు
  ఉప్పరిపల్లి        రూ. 10 లక్షలు
  న్యూనాగోల్ కాలనీ       రూ. 6.81 లక్షలు 
  రామాంతపూర్        రూ. 6.80 లక్షలు