Huge Crowd In Khairatabad Metro Station: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం అశేష భక్తజనం మధ్య కోలాహలంగా సాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh Immersion) వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. విపరీతమైన రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను సిబ్బంది మూసేశారు. పది నిమిషాలకోసారి గేట్లు తెరిచి ప్రయాణికులను లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో (Khairatabad Metro Station) పాటు బస్టాప్స్ సైతం కిక్కిరిసిపోయాయి. 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని భారీ విగ్రహ నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.
అర్ధరాత్రి వరకూ మెట్రో
అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుంది. నిమజ్జనం ముగిసే వరకూ ప్రయాణికుల రద్దీ, అవసరం మేరకు అదనపు రైళ్లు నడుపుతామని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎంఎంటీఎస్ రైళ్లు సైతం అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ సర్వీసులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్ - హైదరాబాద్, లింగంపల్లి - ఫలక్‌నుమా, లింగంపల్లి - హైదరాబాద్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - హైదరాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు సీపీ విజ్ఞప్తి
నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఉదయం వరకూ విగ్రహాలన్నీ నిమజ్జనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తామన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. బాలాపూర్ వినాయకున్ని కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో దాదాపు లక్ష విగ్రహాలు ఉండొచ్చని వాటిలో 20 వేల నుంచి 30 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులు ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.