Medchal Latest News: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప పడిపూజ జరుగుతున్నప్పుడు పోలీసులు హాంగామా సృష్టించారని స్వాములు ఆందోళన చేపట్టారు. అయ్యప్ప పడిపూజ జరుగుతుండగా పూజా ఆవరణ మండపంలోకి బూట్లతో వచ్చారని ఆందోళన బాటపట్టారు. మేడ్చల్ ఎస్.ఐ అశోక్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 


డిసెంబర్ 25వ తేదీ బుధవారం కండ్లకోయలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద అయ్యప్పపడిపూజ జరిగింది. ఎవరో ఫిర్యాదు చేశారని పెద్ద పెద్ద శబ్ధాలు లేకుండా పూజలు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే పోలీసులకు స్వాములకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ టైంలో అయ్యప్ప పడిపూజ జరుగుతుండగా ఎస్‌ఐ అశోక్ మండపంలోకి వచ్చారు. ఆయనతోపాటు సిబ్బంది కూడా బూట్లతో ఆ ప్రాంతానికి వచ్చారు. 


పాదరక్షలు వేసుకొని రావడమే కాకుండా తక్షణమే పూజ ఆపేయాలని హుకుం జారీ చేసినట్లు స్వాములు ఆరోపిస్తున్నారు. క్రిస్మస్ రోజున అయ్యప్ప పడిపూజ ఎలా చేస్తారని కూడా ఎస్ఐ అశోక్ ప్రశ్నించారని చెబుతున్నారు. మంత్రాలు, పూజలు ఆపకుంటే మీ సంగతి చూస్తానని, మీ అందరిపై కేసులు నమోదు చేస్తానని బెదిరించినట్లు రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. చెప్పులు వేసుకుని మండప ఆవరణంలోకి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  


అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ.. హిందువుల హక్కులను కాలరాసేలా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు హరిహర నందన అయ్యప్ప దేవస్థానం ధర్మకర్త ఆర్ మల్లారెడ్డి, ముదిరాజ్, సుశాంత్ రెడ్డి పాల్గొన్నారు.


ఎస్సై ఆవరణలోకి బూట్లు వేసుకొని వచ్చారని చెప్పే వీడియోతోపాటు స్వాముల నుంచి ఫిర్యాదు తీసుకున్నటైంలో, మాట్లాడే టైంలో బూట్లు తీసిన ఏసీపీ వీడియోలను షేర్ చేస్తున్నారు. పోలీసులు కేవలం అయ్యప్ప స్వాములకే సౌండ్ తక్కువ పెట్టాలని ఎందుకు సూచిస్తున్నారని ప్రశ్నించారు. అయ్యప్ప స్వాములు అందరూ జైశ్రీరామ్, స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేశారు


ఇదే విషయంపై ఏపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
అయ్యప్ప పడిపూజ జరుగుతున్న సమీపంలో చర్చి ఉందని తెలిపారు. అక్కడ క్రిస్మస్ వేడుకలు జరిగాయని వివరించారు. ఎవరో డయల్‌100కు ఫోన్ చేససి ఫిర్యాదు చేశారని చెప్పారు. కంప్లైంట్ అందిన వెంటనే మేడ్చల్ పోలీసులు అక్కడికి వెళ్లి చర్చి వారికి, అయ్యప్ప పడిపూజ నిర్వాహకులకు సౌండ్ తగ్గించాలని సూచించారన్నారు. 


ఈ క్రమంలోనే స్వాములు, పోలీసుల మధ్య వాగ్వాదం తోపులటా జరిగిందన్నారు. పోలీసులు మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారని నిన్న పేర్కొన్నారు.