Latest Weather Update: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న అల్పపీడనం బలహీనపడినట్టు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. ఇది ప్రస్తుతానికి బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. 24 గంటల్లో ఇది మరింత బలహీనపడబోతోందని తెలిపారు. దీని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు చేసింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వాతావరణం చాలా కూల్‌గా ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మోస్తరు వర్షాలతోపాటు గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ముందుజాగ్రత్తగా అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
డిసెంబర్ 27 శుక్రవారం నాడు ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య , చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణపై కూడా ఉపరితల ఆవర్తనం ప్రభావం గట్టిగానే ఉంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న శీతల గాలులు తెలంగాణ ఉష్ణోగ్రతలపై పెను ప్రభావం చూపబోతున్నాయి. అందుకే సాధారణ ఉష్ణోగగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అంతేకాకుండా చలి తీవ్రత దారుణంగా పెరగనుంది. జనం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం పూట పొగమంచు విపరీతంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 28 వ తేదీ వరకు వర్షావరణం ఉంటుంది. తర్వాత నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.