Telangana Election Day Updates: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీ లతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ ఆమె తీరు అభ్యంతరకరంగా ఉండడంతోనే ఈ కేసు పెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో తప్పిదాలు, దొంగఓట్ల గురించి తొలి నుంచి మాధవీలత ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం మహిళలు బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రానికి రాగా.. వారిపై మాధవీలత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న మాధవీ లత.. బుర్ఖా వేసుకొని ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలపై కూడా ఓ కన్నేశారు.


పోలింగ్ కేంద్రంలో ఉన్న వారి గుర్తింపు కార్డులను తీసుకొని పరిశీలించారు. అలాగే హిజాబ్ తొలగించమని చెప్పి వారి ముఖాన్ని సరిపోల్చుకున్నారు. గుర్తింపు కార్డులో పేర్కొన్న వయసుకు తగ్గట్లే ఆ మహిళలు ఉన్నారా అనేది కూడా పరిశీలించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది వివాదాస్పదం కావడంతో పోలీసులు మాధవీ లతపై కేసు నమోదు చేశారు.


ఈ వ్యవహారంపై మాధవీ లత మాట్లాడుతూ.. ‘‘నేను ఒక అభ్యర్థిని. చట్ట ప్రకారం ఓటర్ల ఐడీ కార్డులు, ముఖాన్ని గుర్తించే అధికారం అభ్యర్థులకు ఉంటుంది. నేను పురుషుడ్ని కాను, దయార్ద్ర హృదయం ఉన్న ఓ మహిళను. హిజాబ్ వేసుకున్న మహిళల వద్దకు వెళ్లి నేను వారి ముఖాన్ని చూపించాలని నేను కోరుతున్నారు. ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు చెక్ చేస్తున్నారు. దీన్ని ఎవరైనా పెద్ద ఇష్యూ చేయాలనుకుంటే వారు భయపడుతున్నట్లే లెక్క’’ అని మాధవీ లత ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.