ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్‌ 8న ఆయన ఇక్కడికి రానున్నట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. ఇప్పటికే ఆయన రాక ఏర్పాట్లలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తామనే ధీమాను మోదీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 


పలు అభివద్ధి కార్యక్రమాల్లో..
ముఖ్యంగా ప్రధాని మోదీ  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనుల శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్‌– తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం తదితర కార్యక్రమాల్లో నూ పాల్గొననున్నారు. అలాగే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్సో్ల జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని మోదీ ప్రసంగిస్తారని అంటున్నారు. సభకు ఏర్పాట్లు, ప్రధాని పర్యటన విజయవంతం చేయడంపై పార్టీ కసరత్తు సాగుతోంది. 


నడ్డా పర్యటన రద్దు..
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దయింది. సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి శుక్రవారం నడ్డా రావాల్సి ఉంది. అయితే ఆయన ఢిల్లీ నుంచే వర్చువల్‌గా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను కూడా నడ్డా వర్చువల్గానే ప్రారంభిస్తారు. అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ చుగ్, సునీల్‌ బన్సల్‌ తదితరులు పాల్గొననున్నారు.