తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వారంలో 6 రోజులు నడిచే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ పరుగులు పెట్టనుంది. ఈ రైలు మంగళవారం తప్ప ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు అని రైల్వే అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తుండగా, ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. ఆ మరుసటి రోజు నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైలులో ప్రయాణికులను అనుమతిస్తారు. సికింద్రాబాద్ - తిరుపతి రైలు నెంబరు 20701. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 14.30 గంటలకు చేరుతుంది.
మధ్యలో స్టాపులు ఇవే
నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29
తిరుపతి - సికింద్రాబాద్ రైలు నెంబరు 20702. తిరుపతిలో మధ్యాహ్నం 15.15కు రైలు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 23.45 గంటలకు చేరుతుంది.
మధ్యలో స్టాపులు ఇవీ
నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్ ఇవీ
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833. సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు నెంబరు 20834. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55), విజయవాడ (10.00), ఖమ్మం (11.00), వరంగల్ (12.05), సికింద్రాబాద్ (14.15) గంటలకు చేరుకుంటుంది.
మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 (మధ్యాహ్నం 3 గంటలు) గంటలకు బయలుదేరి వరంగల్ (16.35), ఖమ్మం (17.45), విజయవాడ (19.00), రాజమండ్రి (20.58), విశాఖపట్నం 23.30 గంటలకు చేరుతుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా కొనసాగుతుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు కోసం ముందే ఖరారు చేసిన షెడ్యుల్ లో మార్పు చేశారు. ఖమ్మం ప్రజల ఒత్తిడి నేపథ్యంలో కొత్తగా ఖమ్మం స్టేషన్‌లో వందేభారత్ రైలును ఆపాలని నిర్ణయించారు. ఈ రైలుకు 18 బోగీలు ఉండగా.. ప్రైమరీ మెయింటెనెన్స్ విశాఖపట్నంలోనే ఉండనుంది.
సెమీ హై స్పీడ్ ట్రైన్
వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతుండటంతో.. త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. ఇవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన ఐదు రైళ్లను పలు ప్రాంతాల్లో పట్టాలెక్కించారు.